ఏ తండ్రికి ఇలాంటి పరిస్థితి రాకూడదు.. నిఖిత కుటుంబ సభ్యుల ఆవేదన..!
అమెరికాలోని మేరీల్యాండ్‌లో అనుమానాస్పద రీతిలో మృతిచెందిన గోడిశాల నిఖిత హత్య ఘటన కుటుంబ సభ్యులను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. డబ్బులు ఇస్తానని చెప్పి పిలిపించుకుని, ఆర్థిక వివాదాల నేపథ్యంలో అర్జున్ శర్మ అత్యంత కిరాతకంగా నిఖితను హతమార్చాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డిసెంబర్ 31న డబ్బులు కావాలంటూ అర్జున్ శర్మ ఫోన్ చేయడంతో నిఖిత అక్కడికి వెళ్లిందని, ఆ సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగి ఆర్థిక ఇబ్బందులే ఈ హత్యకు కారణమై ఉంటాయని వారు భావిస్తున్నారు. హత్య అనంతరం అర్జున్ శర్మ అక్కడి నుంచి పరారై భారత్‌కు వచ్చాడని తెలిసిందని నికిత తండ్రి తెలిపారు.
జనవరి 11న సోమనాథ్ ఆలయాన్ని సందర్శించనున్న మోడీ
ప్రధాని మోడీ జనవరి 11న సోమనాథ్ ఆలయాన్ని సందర్శించనున్నారు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వంలో పాల్గొననున్నారు. ఈ పర్వం జనవరి 8 నుంచి 11వ తేదీ వరకు జరగనుంది. అనేక ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు జరగనున్నాయి. చివరి రోజు ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే సోమనాథ్ ఆలయం విధ్వంసానికి గురై జనవరి 2026తో 1,000 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా సోమనాథ్ విశిష్టతను తెలియజేస్తూ ప్రధాని మోడీ ప్రత్యేక వ్యాసం రాశారు. సోమనాథ్ ఆలయం.. గుజరాత్‌లోని వెరావల్ సమీపంలోని ప్రభాస్ పటాన్ దగ్గర నిర్మితమైన పవిత్రమైన హిందూ పుణ్యక్షేత్రం. 12 జ్యోతిర్లింగాల్లో మొదటిది. రాతితో అద్భుతమైన శిల్పాలతో నిర్మితమైంది. అనేకసార్లు ధ్వంసానికి గురైంది. జనవరి 1026లో ఈ ఆలయంపై గజనీ మహమూద్ దాడి చేసి నాశనం చేశాడు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో తిరిగి పునర్నిర్మించబడింది. ఈ ఘట్టానికి 2026లో 75 ఏళ్లు పూర్తైంది.
నా కొడుకులపై ప్రమాణం చేసి చెబుతున్నా.. నాది ఆస్తుల పంచాయితీ కాదు!
కుటుంబ గొడవలపై ఎమ్మెల్సీ కవిత మొదటిసారి స్పందించారు. తనది ఆస్తుల పంచాయితీ కాదుని, ఆత్మగౌరవ పంచాయితీ అంటూ.. తాను ఇష్టంగా కొలిచే లక్ష్మీ నరసింహ స్వామి, తన ఇద్దరు కొడుకులపై ప్రమాణం చేశారు. నైతికతలేని పార్టీలో తాను ఉండదల్చుకోలేదని.. అందుకే రాజీనామా చేశా అని చెప్పారు. తన రాజీనామాను మండలి చైర్మన్ వెంటనే ఆమోదించాలని కవిత కోరారు. శాసనమండలిలో కవిత భావోద్వేగం చెందారు. తన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుతూ.. ప్రసంగం మధ్యలో కంటతడి పెట్టారు.
ముదురుతోన్న ముస్తాఫిజుర్ రెహమాన్ వివాదం.. ఐపీఎల్ 2026 ప్రసారాన్ని నిషేధించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం..
క్రికెట్ విషయంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య వివాదం తీవ్రమవుతోంది. పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ పై నిషేధం విధించిన తర్వాత, బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఐపీఎల్ 2026 ప్రసారాన్ని నిషేధించింది. ఈ నిర్ణయాన్ని ధృవీకరిస్తూ బంగ్లాదేశ్ అధికారులు జనవరి 5న ఒక ప్రకటన విడుదల చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఐపీఎల్‌కు సంబంధించిన ప్రసారాలు, కార్యక్రమాలను తక్షణమే నిలిపివేసినట్లు బంగ్లాదేశ్ సమాచార, ప్రసార శాఖ తెలిపింది. ఇప్పటికే లిటన్ దాస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ జట్టు ఫిబ్రవరి 7 నుండి మార్చి 8 వరకు జరగనున్న టీ20 ప్రపంచ కప్ కోసం భారత్ కు వెళ్లదని బీసీబీ స్పష్టం చేసింది. ఈ కారణంగా ఆటగాళ్ల భద్రతా సమస్యలను బీసీబీ ఉదహరించింది. బంగ్లా టైగర్స్ భారతదేశంలో నాలుగు మ్యాచ్‌లు ఆడవలసి ఉంది. మూడు కోల్‌కతాలో. ఒకటి ముంబైలో.
కోనసీమలో ఓఎన్జీసీ బావి నుంచి భారీగా గ్యాస్ లీకేజ్.. భయాందోళనలో గ్రామస్తులు..
కోనసీమలో ఓఎన్జీసీ బావి నుంచి భారీగా గ్యాస్ లీకేజ్ కలకలం సృష్టించింది. ఒ ఎన్ జి సి అధికారులకు సమాచారం అందించారు స్థానికులు. బ్లో అవుట్ తరహాలో మంటలు కూడా రావడంతో అదుపు చేసేందుకు వెళ్లిన ONGC సిబ్బంది పరుగులు తీశారు. రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలోని ONGC బావి వద్ద మధ్యాహ్నం 12 గంటల సమయంలో పేలుడు జరిగిన క్రమంలో గ్యాస్ పైప్ లైన్ నుంచి ఈ లీకేజ్ సంభవించింది. భారీగా గ్యాస్ బయటకు వచ్చి గ్రామంలోకి వ్యాపించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. గ్యాస్ లీకేజ్ అదుపు చేసేందుకు ప్రయత్నించగా భారీగా మంటలు ఎగిసి పడ్డాయి. ప్రస్తుతం గ్యాస్ లీకేజ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
కొత్త రాజకీయ పార్టీ వస్తుంది.. నన్ను ఆశీర్వదించండి!
ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొత్త రాజకీయ వేదిక రాబోతోందని చెప్పారు. ‘తెలంగాణ జాగృతి’ రాజకీయ పార్టీగా మారుతుందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కొత్త రాజకీయ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. తాను కచ్చితంగా గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతానని ధీమా వ్యక్తం చేశారు. వ్యక్తిగా శాసనసభ నుంచి వెళ్తున్నానని, రాజకీయ శక్తిగా తిరిగివస్తానని చెప్పుకొచ్చారు. తనను ఆశీర్వదించండని, తనతో పాటు నడవండని కవిత కోరారు.
భగ్గుమన్న పాతకక్షలు.. కందనాతిలో రక్తపాతం.. ఇద్దరి హత్య, చిన్నారికి తీవ్ర గాయాలు..!
రాయలసీమలో మరోసారి పాతకక్షలు భగ్గుమన్నాయి. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం కందనాతి గ్రామంలో పాతకక్షలు హింసాత్మకంగా మారాయి. ప్రత్యర్థుల దాడిలో ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. వెంకటేష్ అనే వ్యక్తిని పొలంలో, పరమేష్‌ను ఇంట్లో ప్రత్యర్థులు హత్య చేశారు. పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో శివారులో కాపు కాచి గోవింద్ (45), వీరేషమ్మ దంపతులపై వేటకొడవళ్లతో దాడి జరిగింది. ఈ ఘటనలో వీరేషమ్మ కుమారుడు ఐదేళ్ల బాలుడు లోకేంద్రకు తీవ్ర గాయాలు కాగా.. గోవింద్ భార్య వీరేషమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గోవింద్ పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత ఏడాది ఇంటి వద్ద కుళాయి నీటి విషయంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో కేసన్న వర్గానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. ఆ ఘటనకు ప్రతీకారంగానే ఇవాళ ఈ దాడి జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం కందనాతి గ్రామంలో పోలీసు బలగాలు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.
తెలంగాణలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ చిన్నాభిన్నం
బీఆర్ ఎస్ పదేళ్ల పాలనలో, కాంగ్రెస్ రెండేళ్ల పాలన ఫలితంగా తెలంగాణలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో 6 వేల స్కూల్స్ మూసివేస్తే… కాంగ్రెస్ పాలనలో వాటిని తెరవకపోగా ఒక్క ఏడాదిలోనే 1500 స్కూల్స్ మూసివేశారని చెప్పారు. ప్రతి విద్యార్ధికి 5 లక్షల భరోసా కార్డు ఇస్తామని గాలికొదిలేశారని, ఫీజు రీయంబర్స్ మెంట్ రాక కాలేజీలు మూతపడుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయంబర్స్ మెంట్ కోసం తాము మద్దతిచ్చినా కొన్ని కాలేజీ యాజమాన్యాలు మాత్రం ప్రభుత్వానికి భయపడి రాజీ పడుతున్నాయన్నారు. ఫీజు రీయంబర్స్ మెంట్ విషయంలో విద్యార్ధులను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాష్ట్రంలో విద్యా సమస్యలపై ఏబీవీపీ చేస్తున్న ఉద్యమాలు ఉధ్రుతం చేయాలని పిలుపునిచ్చారు.
అతిత్వరలో మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ.. మిగిలింది వీళ్లే..!
తెలంగాణ రాష్ట్రాన్ని అతి త్వరలోనే ‘మావోయిస్టు రహిత రాష్ట్రం’గా ప్రకటించేందుకు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన కేవలం 17 మంది కీలక మావోయిస్టు నేతలు మాత్రమే మిగిలి ఉన్నారని, వారు కూడా లొంగిపోతే రాష్ట్రం పూర్తిస్థాయిలో మావోయిస్టు రహితంగా మారుతుందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ పోలీసులు సిద్ధం చేసిన నివేదిక ప్రకారం, అండర్ గ్రౌండ్‌లో ఉన్న ఈ 17 మంది నేతలపై ప్రభుత్వం భారీగా రివార్డులను ప్రకటించింది. వీరిపై మొత్తం కలిపి 2 కోట్ల 25 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు సమాచారం. ఈ జాబితాలో ఐదుగురు మహిళా మావోయిస్టులు కూడా ఉండటం గమనార్హం.
ఎట్టకేలకు క్షమాపణలు చెప్పిన అనసూయ
నటి రాశికి క్షమాపణలు చెబుతూ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గతంలో అనసూయ ఒక టీవీ షోలో రాశి గురించి అనకూడని మాటలు అనేసింది. ఒక స్కిట్లో భాగంగా రాశి ఫలాలు అనాల్సింది రాశి గారి ఫలాలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది/ అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని రాశి విమర్శించింది. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటూ ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో తాజాగా అనసూయ తన సోషల్ మీడియా వేదికగా స్పందించింది. కొన్నేళ్ల క్రితం ఒక కామెడీ షోలో నటి రాశి గారిపై వచ్చిన ‘డబుల్ మీనింగ్’ డైలాగుల విషయంలో ఆమె స్పందిస్తూ, రాశికి తన హృదయపూర్వక క్షమాపణలు తెలియజేశారు. సుమారు మూడేళ్ల క్రితం ఒక టీవీ షోలో భాగంగా చేసిన స్కిట్‌లో, అనసూయ నోటి వెంట రాశి గారిని ఉద్దేశించి ద్వంద్వార్థం వచ్చే డైలాగులు వచ్చాయి. అప్పట్లో ఆ డైలాగులు రాసిన రచయితలు, దర్శకులను తాను నిలదీయలేకపోయానని, అది తన వైఫల్యమేనని అనసూయ అంగీకరించారు.