TRS BJP Munugode Election Nomination: గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో బరిలో నిలిచిన టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ ఎన్నికలపై ఎన్నికల సంఘం నిఘా పెట్టడంతో నామినేషన్ల కార్యక్రమాన్ని సాదాసీదాగా నిర్వహించాలని టీఆర్‌ఎస్ నాయకత్వం నిర్ణయించినట్లు విశ్వనీయ సమాచారం. అయితే.. ఇవాళ సీపీఎం, సీపీఐ నేతలతో కలిసి ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ సమర్పించనున్నారు.నామినేషన్ల చివరి రోజైన ఈ నెల 14న మరో సెట్ నామినేషన్ వేయనున్న సంగతి తెలిసిందే.
అయితే.. ఇవాళ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. మునుగోడు నుంచి చండూరు వరకు భారీ ర్యాలీతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. నామినేషన్ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుంచుగ్‌తో పాటు స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్, ఈటల రాజేందర్, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, భూపేంద్ర యాదవ్, లక్ష్మణ్, డీకే.అరుణ హాజరుకానున్నారు.
అయితే.. మునుగోడు ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం, త్వరలో అభ్యర్థిని ప్రకటిస్తామని TJS అధ్యక్షుడు కోదండరాం ప్రకటించిన విషయం తెలిసిందే. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో కేసీఆర్ కే కాదు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని మండిపడ్డారు. తెలంగాణ అసలు స్వరూపాన్ని వివరిస్తామని తేల్చిచెప్పారు. రాజగోపాల్ రెడ్డి ప్రత్యామ్నాయ రాజకీయాలు చూపిస్తామని, లక్షల కోట్లు కుమ్మరిస్తున్నారని అన్నారు. కృష్ణానది జిల్లాలో తెలంగాణ వాటా ఎంతో బీజేపీ తేల్చాలని ప్రశ్నలు కురిపించారు. రాజగోపాల్ రెడ్డి తన ప్రయోజనాలకు సంబంధించిన హామీని మాత్రమే బీజేపీ నుంచి పొందాడని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆశయాలను తాకట్టుపెట్టి మేమే ప్రత్యామ్నాయం అంటే నమ్మేదెట్లా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కూడా అనుకున్న స్థాయిలో ప్రజల సమస్యలను చర్చించే ప్రయత్నం చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.