Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు మరో 26 రోజుల వ్యవధి మాత్రమే వుంది. ప్రధాన పార్టీలతో పాటు ఇతర పార్టీలు ఎన్నికల కార్యాచరణలో వేగాన్ని పెంచాయి. ఇవాళ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ కార్యక్రమాలతో చౌటుప్పల్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న 12 మంది మంత్రులు, 76 మంది ఎమ్మెల్యేలకు అధికార టీఆర్‌ఎస్ బాధ్యతలు అప్పగించగా నిన్న ఒక్కరోజే ఐదుగురు మంత్రులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇక.. సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రచారంలో పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేడు చౌటుప్పల్ మండలంలో రోడ్‌షో నిర్వహించనున్నారు. చౌటుప్పల్ కేంద్రంగా యాదవుల ఓట్లే లక్ష్యంగా కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ సభ నిర్వహించనున్నారు. మున్నూరుకాపు ఓటర్లను ఆకర్షించేందుకు చౌటుప్పల్‌లో టీఆర్‌ఎస్ నేతలు సమావేశం నిర్వహించారు. కార్మికులు, ప్రైవేటు ఉద్యోగుల ఓట్లే లక్ష్యంగా మంత్రి మల్లారెడ్డితో నేడు చౌటుప్పల్‌లో సమావేశం నిర్వహించనున్నారు.
చౌటుప్పల్‌కు నేడు రేవంత్, ఉత్తమ్ ఏఐసీసీ అధ్యక్షుడి రేసులో మల్లికార్జున ఖర్గె ఉండడం, ప్రచారంలో భాగంగా ఆయన నిన్న (శనివారం) హైదరాబాద్‌కు రావడంతో కాంగ్రెస్ నేతలంతా హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. ఖర్గె పర్యటన పూర్తికావడంతో నేటి నుంచి ప్రచారంలో కాంగ్రెస్ జోరు పెంచనుంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు చౌటుప్పల్ పట్టణంతో పాటు గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించనున్నారు. పార్టీ అభ్యర్థి స్రవంతి ఇంటింటికీ తిరిగి మహిళా ఓటర్లకు బొట్టుపెట్టి ఓటు అడిగే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టారు.
Read also: Russia-Ukraine War: జపొరిజ్జాయాపై రష్యా మిస్సైల్ దాడి.. 17 మంది మృతి
అయితే ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మునుగోడు ఉప ఎన్నికపై దృష్టి పెట్టారు. 10 నుంచి 12 రోజుల పాటు తాను మునుగోడు ప్రచారంలో పాల్గొంటానని, భారీ జనసమీకరణతో నామినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. నాయకులు, అభ్యర్థి ప్రచార షెడ్యూల్‌ను ఖరారు చేయాలని, ఇతర ప్రాంతాల నుంచి మునుగోడుకు వచ్చిన నేతలకు వసతి, భోజన సౌకర్యాల ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. యాదవుల ఓట్లే లక్ష్యంగా చౌటుప్పల్‌లో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సభ నేడ నిర్వహించనున్నారని తెలిపిన విషయం తెలిసిందే..
ఉప ఎన్నిక బరిలో దిగనున్న అభ్యర్థుల పేర్లు
అయితే.. ఉప ఎన్నిక బరిలో దిగనున్న అభ్యర్థుల పేర్లను ఆయా పార్టీలు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే…
టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
కాంగ్రెస్ తన అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించగా..
బీజేపీ తన అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
ప్రజాశాంతి పార్టీ తరఫున గద్దర్
బీసీ సామాజికవర్గానికి చెందిన ఆందోజు శంకరాచారిని అభ్యర్థిగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు.
దీంతో ఉప ఎన్నికలకు ప్రచారంలో పాల్గొనేందుకు పోటా పోటీ కార్యక్రామాలు సిద్దం చేశారు పార్టీ శ్రేణులు.
చౌటుప్పల్ లో రోడ్ షో, సభ, సమావేశాల అనంతరం పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టారు. చౌటుప్పల్ లో భారీగా పోలీసులు మోహరించారు. ట్రాఫిక్ కు అంతరాయం కాకుండా దారి మల్లించారు. ప్రమాణికులు గమనించాలని, సహకరించాలని సూచించారు.