తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తే రైతులకు మరింత మేలు జరుగుతుందంటోంది వ్యవసాయ శాఖ. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తూన్నారు ఉద్యానవన శాఖ అధికారులు.దేశవ్యాప్తంగా కూరగాయలకు రోజురోజుకు డిమాండ్ పెరుతుంది. కూరగాయల సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఆయా జిల్లాలో ఉద్యానవన శాఖ అధికారులు ఏయే కూరగాయలు సాగు చేస్తే లాభం చేకూరుతుంది అనే దానిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎక్కువగా టమాటా, మిర్చి వంటి కురాగాయలతో పాటు ఆకుకూరలకు చాలా డిమాండ్ ఉంటుంది.
కాబట్టి వాటి సాగు కావాల్సిన మెలకువలు రైతులకు అందిస్తోంది వ్యవసాయ, ఉద్యానవన శాఖ. రాష్ట్ర జనాభాకు కావల్సినన్ని కూరగాయలు రాష్ట్రంలోని రైతులు పండించడం లేదని అయితే ఇతర రాష్ట్రాల నుంచి టమాటా, ఇతర కూరగాయలు దిగుమతి చేసుకోవడంతో వినియోదారులకు భారం పడుతోంది అని ఉద్యానవన శాఖ అధికారులు అంటున్నారు. మన రాష్ట్రంలో టమాటా వంటి కూరగాయలు పండించేందుకు 40 శాతం అనువైన ఎర్ర నేలలు వున్నాయని అంటున్నారు. అంతేకాకుండా ఇతర ఆయిల్ ఫామ్, పప్పు దినుసుల వంటి వాటికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు కూడా ఇస్తుంది.యాసంగిలో కూరగాయల సాగు చేస్తే రైతుకు మరింత లాభం చేకూరుతుంది. ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఎక్కువగా దిగుమతులు చేసుకుంటుంది తెలంగాణ.
అయితే అక్కడ వాతావరణ మార్పుల వలన చాలా సార్లు కూరగాయల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇటీవల ఏపీ, కర్ణాటక, తమిళనాడులో వర్షలా వలన టమాటా రేటు ఎన్నడూ లేనంతగా పెరిగింది. ఎక్కువగా ఏపీ మదనపల్లె నుండి టమాటా దిగుమతి అవుతుంది. అక్కడ భారీ వర్షాలతో పంటలు పాడవడంతో కూరగాయల రేట్లు కొనలేనంతగా పెరిగాయి. కాబట్టి రాష్ట్ర అవసరాలకు కావాల్సిన కూరగాయలు మనమే పండిస్తే ఇటు రైతుకు అటు వినియోదారునికి మేలు జరుగుతుందని అధికారులు అంటున్నారు ఉద్యానవన అధికారులు.వ్యవసాయ శాఖ యాసంగి సాగుకు అనుకూలమైన 10 పంటలను ప్రతిపాదిస్తూ ఇటీవల ప్రణాళిక విడుదల చేసింది. పల్లి, శనగ, ఆవాలు, నువ్వులు, కుసుమలు, పెసర్లు, ఆముదం, మినుము, పొద్దుతిరుగుడు, జొన్న వేయాలని రైతులకు విజ్ఞప్తి చేసింది. అయితే యాసంగిలో వరి సాగు విస్తీర్ణం రెండేళ్లుగా పెరుగుతూ వస్తోంది. రాష్ట్ర చరిత్రలో ఇంత అసాధారణ స్థాయిలో యాసంగిలో వరి సాగైన సందర్భాలు లేవని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది యాసంగిలో సాధారణ సాగు విస్తీర్ణం 31 లక్షల ఎకరాలకు పెరిగిందని వ్యవసాయ శాఖ స్పష్టం చేస్తోంది.