Urea : తెలంగాణ రైతులకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త తెలిపారు. రాష్ట్రంలో యూరియా కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు యూరియా నిల్వలను పెంచాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. త్వరలోనే రాష్ట్రానికి భారీగా యూరియా స్టాక్ చేరుతుందని చెప్పారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ప్రారంభమయ్యే రబీ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని, ఈసారి యూరియా కొరత రాకుండా ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. గతంలో యూరియా లభించక రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, ఈసారి ముందుగానే నిల్వలను పెంచుతున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం తెలంగాణలో 2.48 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్ అందుబాటులో ఉందని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. డిసెంబర్ చివరి నాటికి ఈ నిల్వలను మరింత పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డిసెంబర్ నెల వరకు అదనంగా 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు వివరించారు.
కొత్త ఏడాదిలో వినియోగదారులకు Mercedes-Benz షాకింగ్ న్యూస్.. మరింత పెరగనున్న కార్ల ధరలు
డిసెంబర్‌కు కేటాయించిన 86 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పటికే కాకినాడ, కృష్ణపట్నం, విశాఖపట్నం, తూత్తుకుడి, గంగవరం, కారైకల్, జైగఢ్ వంటి వివిధ ఓడరేవులకు చేరుకుందని తెలిపారు. ఈ యూరియాను వేగంగా తెలంగాణకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ విషయంలో రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌కు లేఖలు రాసినట్లు మంత్రి వెల్లడించారు.
యూరియా రవాణా ప్రక్రియ వేగవంతం అయ్యేలా సంబంధిత అధికారుల మధ్య సమన్వయం పెంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. యూరియా తరలింపునకు అవసరమైన ఖాళీ రైల్వే రేక్‌లను తక్షణమే కేటాయించాలని రైల్వేశాఖ మంత్రిని కోరినట్లు తెలిపారు. అలాగే పోర్టుల్లో క్లియరెన్స్, హ్యాండ్లింగ్ ప్రక్రియలను వేగవంతం చేయాలని, ఇతర సరుకుల కంటే యూరియా రవాణాకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.
రవాణాలో ఎలాంటి జాప్యం లేకుండా పోర్టు అధికారులు, షిప్పింగ్ లైన్లు, హ్యాండ్లింగ్ ఏజెన్సీలు, రైల్వే అధికారుల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచాలని మంత్రి సూచించారు. ఈ మొత్తం రవాణా ప్రక్రియను పర్యవేక్షించేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులను కూడా ఓడరేవులకు పంపినట్లు ఆయన తెలిపారు.
Akhanda 2 సినిమాలో తమన్ విధ్వంసం.. మొత్తానికి పేల్చేశాడుగా..