Tummala Nageswara Rao : తెలంగాణలో యూరియా కొరతపై కేటీఆర్ విమర్శలకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. ఈ వారంలోనే రాష్ట్రానికి అదనంగా 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖను కోరినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ రైతాంగ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే సరఫరా చేయాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు చేపట్టిన ఆందోళన ఫలితంగా ఈ చర్యలు ప్రారంభమయ్యాయని తుమ్మల వ్యాఖ్యానించారు. కోరమాండల్ ఇంటర్నేషనల్‌కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసి, మూడు షిప్‌మెంట్లలో యూరియా సరఫరా చేయనున్నట్టు వెల్లడించారు.
Kamal – Rajni వారసున్ని ప్రకటించిన వెంటనే రజనీ- కమల్ సినిమా?
యూరియా కొరతపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అర్థరహితమైనవి అని తుమ్మల తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో బఫర్ స్టాక్స్ లేకపోవడం వాస్తవం కాదని, యూరియా సరఫరాలో జరిగిన ఆలస్యానికి కేంద్ర ప్రభుత్వ జాప్యం కారణమని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలు రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తూ, చెప్పుల క్యూ లైన్ డ్రామా లాంటి కార్యక్రమాలతో మభ్యపెడుతున్నాయని విమర్శించారు. తుమ్మల వివరాల ప్రకారం, తెలంగాణ రైతాంగానికి మొత్తం 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపు జరిగింది.
అందులో 2.10 లక్షల టన్నుల కొరత ఇంకా కొనసాగుతుందని, ముఖ్యంగా ఈ నెలలో వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల అదనంగా 80 వేల టన్నులు అవసరమవుతున్నాయని వెల్లడించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యలను కూడా తుమ్మల తప్పుబట్టారు. అవి రైతాంగ సమస్యలపై అవగాహన రాహిత్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. “సవాళ్లు విసరడం కాదు, సమస్యకు పరిష్కారం కనుక్కోవడమే ముఖ్యమని” తుమ్మల స్పష్టం చేశారు. రైతాంగ శ్రేయస్సు కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.