Telangana Rising Global Summit : తెలంగాణ రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో, పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 8వ తేదీన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ను నిర్వహించడానికి సిద్ధమైంది. ఈ సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేయనున్నారు. ఈ కీలకమైన సదస్సును రాజకీయాలకు అతీతంగా జరపాలని ప్రభుత్వం సంకల్పించింది.
ఇందులో భాగంగా, సమ్మిట్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు సహా కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఆహ్వానించినవారందరూ ఈ కార్యక్రమం రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచి అవుతుందని అభినందించారని, తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.
అయితే, ఈ సమ్మిట్ ప్రారంభానికి ముందే తీవ్ర రాజకీయ రగడ మొదలైంది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ నుంచి ఎలాంటి వ్యతిరేకత కనిపించకపోయినా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. బీజేపీ నేతలు ఈ గ్లోబల్ సమ్మిట్‌ను కేవలం ఒక జిమ్మిక్ గా కొట్టిపారేస్తున్నారు.
బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ, ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ అంటూ హడావిడి చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి దృష్టి మరల్చడం వెన్నతో పెట్టిన విద్య అని విమర్శిస్తూ, తెలంగాణ దేంట్లో రైజింగ్ లో ఉందో చెప్పాలని నిలదీశారు. వాస్తవానికి, తెలంగాణ గన్ కల్చర్, అవినీతి మరియు డ్రగ్స్ కల్చర్‌లో మాత్రమే రైజింగ్ లో ఉందని, అందుకే తెలంగాణ రైజింగ్ కాదు, సికింగ్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఈ రకంగా రాష్ట్ర ప్రజలను భ్రమింపజేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలకు సైతం సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ డిన్నర్ ఏర్పాటు చేసి, సమ్మిట్‌కు ఆహ్వానించినప్పటికీ, బీజేపీ నేతలు సదస్సుకు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా జరగాలని భావించిన ఈ సదస్సుపై సోమవారం మొదలుకానుంది. ఈ నేపథ్యంలో, సమ్మిట్ ముగిసేలోగా ఇంకెన్ని ఆరోపణలు, విమర్శలు వినిపిస్తాయో చూడాలి.