DGP Anjani Kumar: మానవ అక్రమ రవాణా ప్రపంచ వ్యాప్తంగా వ్యవస్థీకృత నేరంగా మారింది. ప్రస్తుతం ప్రపంచంలో 3వ అతిపెద్ద వ్యవస్థీకృత నేరంగా మారిపోయింది. మానవ అక్రమ రవణాను నిరోధించడంలో తెలంగాణ పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా చేసే వారిపై పీడీ కేసులు నమోదు చేస్తున్నారు. మానవ అక్రమ రవాణా అంశంపై తెలంగాణ పోలీస్ అకాడమీలో తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో రాష్ట్ర పోలీసు మహిళా భద్రతా విభాగం, బచ్‌పన్ బచావో ఆందోళన సంస్థ సంయుక్తంగా రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో డీజీపీ అంజనీ కుమార్‌తోపాటు రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ షికా గోయల్, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ సందీప్ శాండిల్య తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచంలో అతిపెద్ద వ్యవస్థీకృత నేరంగా మారిన మానవ అక్రమ రవాణా విషయంలో తెలంగాణ రాష్ట్రంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. సమాజానికి ముప్పుగా పరిణమించిన మానవ, పిల్లల అక్రమ రవాణాను అరికట్టేందుకై పోలీస్ శాఖతోపాటు స్వచ్ఛంద సంస్థలు కలసికట్టుగా పనిచేయాలని కోరారు. ట్రాఫికింగ్‌ను ఎదుర్కోవడానికి వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకొని.. వాటిని క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా ఉపయోగించాలని డీజీపీ సూచించారు.
Read also: 2018 Movie: 2018 మూవీ ఓటిటీ క్యాన్సిల్.. ఇండస్ట్రీకి పట్టిన దరిద్రం అదే..?
మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి నిర్వహించే అన్ని కార్యకలాపాలకు సంబంధించి రాష్ట్రంలో మహిళా భద్రతా విభాగం నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుందని రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ షికా గోయల్ పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు పనిచేస్తున్న మొదటి రాష్ట్రం తెలంగాణ అని తెలియజేశారు. తెలంగాణ పోలీసులు మానవ అక్రమ రవాణా పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నారని .. తద్వారా డబ్ల్యుఎస్‌డబ్ల్యు, ఏహెచ్‌టియూ విభాగాల సంయుక్త కృషితో గత రెండేళ్లలో 738 కేసులు నమోదుచేసి, 1961 మంది నిందితులను అరెస్టు చేశామని షికా గోయల్ వెల్లడించారు. అదేవిధంగా 110 మంది నిందితులపై ప్రివెంటివ్ డిటెన్షన్(PD) చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. తప్పిపోయిన పిల్లలను గుర్తించడంలో ఏహెచ్‌టియూ యూనిట్ పోలీసులకు సహాయం చేస్తోందన్నారు.