తెలంగాణలో 2022-2023 విద్యా సంవత్సరానికి పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలీసెట్) నోటిఫికేషన్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ మేరకు ఏప్రిల్ రెండో వారం నుంచి పాలీసెట్ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నట్లు విద్యాశాఖ ప్రకటన చేసింది. జూన్ 4 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. రూ.100 ఆలస్య రుసుముతో జూన్ 5 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. జూన్ 30న పాలీసెట్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తామని తెలిపింది.
పాలీసెట్ ద్వారా పదో తరగతి పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఇంజనీరింగ్/నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తారు. అందువల్ల పాలీసెట్ రాయాలంటే పదో తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలి. పాలీసెట్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలు, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో నడుస్తోన్న సెకండ్ ఫిప్ట్ పాలిటెక్నిక్ కాలేజీలు, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, పీవీ నర్సింహా రావు తెలంగాణ యూనివర్సిటీతో పాటు వీటికి అనుబంధంగా ఉన్న పాలిటెక్నిక్ కోర్సులు అందించే సంస్థల్లో సీట్లను భర్తీ చేయనున్నారు.