శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన నిరసనల సందర్భంగా రైల్వే పోలీసు అధికారులు 8ఏళ్ల క్రితం నాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లనే ధరించినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం సుమారు 2,000 మంది ఆర్మీ ఆశావహులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆవరణలోకి ప్రవేశించి, కోచ్‌లను తగులబెట్టి నిరసన వ్యక్తం చేయడంతో పోలీసు అధికారులు రాళ్ల దాడులను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పడి దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత కూడా రాష్ట్ర పోలీసులు ‘ఏపీ పోలీస్’ అని రాసి ఉన్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లనే ధరించారు. ఈ జాకెట్లకు గడువు తేదీ లేదని అధికారులు ధ్రువీకరించినప్పటికీ కూడా తెలంగాణకు చెందిన పోలీసులు ఇంకా వాటినే ధరిస్తున్నారు. నేర పరిశోధనలో, గాడ్జెట్ల వినియోగంతో పాటు అన్నింట్లోనూ తెలంగాణ పోలీసులు బెస్ట్ అని చెప్పుకునే అధికారులు.. ఇంకా ‘ఏపీ పోలీస్’ అని రాసి ఉన్న బుల్లెట్ ప్రూఫ్ దుస్తులు ధరించడం ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ రాష్ట్ర పోలీసులు నేర పరిశోధన కోసం గాడ్జెట్‌లు, సీసీటీవీలు, ఎస్‌యూవీలు, పెట్రోలింగ్ బైక్‌లు వంటి ఇతర సాంకేతిక సాధనాల పరంగా డిపార్ట్‌మెంట్‌ను మెరుగుపరుస్తున్నారు. కానీ చాలా అవసరమైన బుల్లెట్ ప్రూఫ్ దుస్తులను అప్‌గ్రేడ్ చేయకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది.