KTR Open Challenge: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి బహిరంగసవాల్ విసిరారు తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. నేను చెప్పేది తప్పయితే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా.. మీరు చెప్పేది తప్పైతే కేంద్ర మంత్రి పదవి వదిలి పెట్టకపోయినా.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోయ లేకుండా మాట్లాడుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష పరోక్ష పన్నుల రూపంలో మూడు లక్షల 68 వేల కోట్ల రూపాయలు కేంద్రానికి చెల్లించిందని.. అందులో 1 లక్షా 68 వేల కోట్ల రూపాయలు మాత్రమే కేంద్రం ఇచ్చిందని స్పష్టం చేశారు.. కానీ, కేంద్ర మంత్రికి, మిగిలిన ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు చేయడం తప్ప.. ఇంకో పని లేదని దుయ్యబట్టారు.. కనీస పరిజ్ఞానం లేకుండా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని ఫైర్ అయిన కేటీఆర్.. జాతీయ పార్టీలు రెండు అబద్ధాలతో, తప్పుడు ప్రచారాలతో ప్రజల వద్దకు వస్తున్నాయని విమర్శించారు.
Read Also: Chandrababu Naidu: కుప్పం ప్రజలది పసుపు రక్తం.. వారి గుండెల్లో ఉండేది సైకిల్
ఇక, కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం.. కేంద్రం కంటే భారీగా పెరిగిందని వెల్లడించారు మంత్రి కేటీఆర్.. 14 మంది ప్రధానులు చేసిన అప్పు కంటే.. ప్రధానిగా నరేంద్ర మోడీ చేసిన అప్పు చాలా ఎక్కువ అన్నారు. అయితే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం అప్పులు చేసిందని.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆ అప్పు భవిష్యత్తు మీద పెట్టుబడి మాత్రమే.. ఆ పెట్టుబడి ద్వారా సంపాదన సృష్టించడమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యంగా చెప్పుకొచ్చారు. నరేంద్ర మోడీ పాలనలో దేశాన్ని దోచుకున్న వాళ్లు మాత్రమే బాగుపడ్డారని సంచలన ఆరోపణలు చేశారు.. మరోవైపు.. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారినా.. జెండా, ఎజెండా, మనుషులు, డీఎన్ఏ, మారలేదని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్.
కాగా, తెలంగాణలో ఆర్ధిక వ్యవస్థ దివాళా తీస్తోందని, జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ వైఖరి ఇలాగే ఉంటే ఆర్ధిక సంక్షోభం తప్పదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడిన విషయం విదితమే.. కల్వకుంట్ల రాజ్యంగం కొనసాగితే, రాష్ట్రం దివాళా తీయక తప్పదని సంచల వ్యాఖ్యలు చేసిన ఆయన.. గ్రామ పంచాయితీల్లో అభివృద్ధి కోసం ఆర్థిక సంఘం సిపారస్ మేరకు నిధులు విడుదల చేసిందని అన్నారు. పంచాయితీల్లో త్రాగునీరు, పారిశుద్ధ్య కార్యక్రమాల కోసం, సిబ్బంది జీతాలు.. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను గద్దల్లా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని అన్నారు. బ్యాంకుల్లో పడ్డ డబ్బుల్ని గంటలోనే దారి మళ్లించారని ఆరోపించారు. డబ్బులు పడ్డ మెసేజ్ చూసి సర్పంచులు బ్యాంకులకు వెళ్తే అప్పటికే దారి మళ్లించారని అన్నారు. సర్పంచులకు తెలియకుండా డిజిటల్ కీ ని దుర్వినియోగం చేశారని.. ఉపాధి హామీ పథకంలోనూ నిధులు దారి మళ్లించారని ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే.