తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందనే వార్తలపై జనసేన ఎంఎల్సీ నాగబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘అసలు నేతిలో నెయ్యి లేకపోవడం ఏంట్రా.. అని అందరూ జుట్టు పీక్కుంటున్నారు కదా’ అంటూ ఆయన ఒక వీడియోను విడుదల చేశారు.. ‘హిందూ ద్రోహి వైసీపీతో ఆడుకునే సెకండ్ ఇన్నింగ్స్ ఇది’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన నాగబాబు, గత ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
‘చిన్నప్పుడు మంత్రాలకు చింతకాయలు రాలతాయని వినేవాళ్లం. కొందరు సిద్ధులు నీళ్ల నుంచి నూనె తీసి దీపాలు వెలిగించారని అంటే నమ్మేవాడిని కాదు. కానీ జగన్ బాబా అండ్ కో మాత్రం పాలు, వెన్న లేకుండానే నెయ్యి తీసేశారు అంటే ఇప్పుడు నమ్మక తప్పడం లేదు’ అంటూ నాగబాబు సెటైర్లు వేశారు. నాణ్యమైన భోజనం పెడతామని డబ్బులు వసూలు చేసి, నకిలీ సరుకులతో భోజనం పెట్టి దబాయించే వారిని ఏమంటారో తెలుసా? నేనైతే వారిని ‘వైసీపీ నాయకులు’ అని, ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే ‘వైసీపీ హయాంలోని టీటీడీ చైర్మన్లు అని అంటాను’ అని తెలిపాడు .
వైసీపీ హయాంలో టీటీడీ చేసిన పని అత్యంత దారుణమని నాగబాబు మండిపడ్డారు. చుక్క పాలు కానీ, వెన్న కానీ లేని ప్రమాదకరమైన కెమికల్స్‌తో తయారు చేసిన సుమారు 60 లక్షల కేజీల ఫేక్ నెయ్యిని స్వామి వారి సొమ్ముతో కొనుగోలు చేశారని ఆరోపించారు. ఆ విషపూరితమైన నెయ్యితో చేసిన ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేయడం ఎంత పాపం, ఎంత ద్రోహం అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ సొమ్ముతో ఎలాగో అవినీతి చేశారని, కనీసం స్వామి వారి టీటీడీనైనా నీతిగా, నిజాయితీగా నడిపి ఉండాల్సింది అని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
హిందూ ద్రోహి వైసీపీ #NoGheeInTTDLaddu pic.twitter.com/WnnMpViA0p
— Naga Babu Konidela (@NagaBabuOffl) February 6, 2026