Telangana GST Officers Raids In Sushee Infra Mining Ltd: బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన సుశీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్ సంస్థలో రాష్ట్ర జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 20 మంది అధికారుల బృందం మధ్యాహ్నం నుంచి తనిఖీలు చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి కుమారుడు సంకీర్త్ రెడ్డి ఎండీగా ఉన్న ఈ సంస్థలో.. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతు ప్రసాద్ నేతృత్వంలో సోదాలు కొనసాగుతున్నాయి. కేవలం ఈ ఇన్‌ఫ్రా కార్యాలయంలోనే కాదు.. ఆ సంస్థ డైరెక్టర్ల ఇళ్లపై కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మునుగోడు ఎన్నికల నేపథ్యంలో.. ఆ సంస్థ నుంచి పెద్దఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగాయని టీఆర్ఎస్ ఆరోపిస్తూ, ఆ లావాదేవాలకు సంబంధించిన జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. దీనిని పరిశీలించిన ఎన్నికల కమిషన్.. ఆ లావాదేవీలు సుశీ ఇన్‌ఫ్రా నుంచి జరిగాయని తేల్చింది. ఈ నేపథ్యంలోనే సుశీ ఇన్‌ఫ్రాపై ప్రత్యేక దృష్టి పెట్టిన రాష్ట్ర జీఎస్టీ అధికారులు, తాజాగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో.. పన్నుల విషయంలోనూ తనిఖీలు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది.
కాగా.. సుశీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్, సుశీ అరుణాచల్ హైవేస్ లిమిటెడ్, సుశీ చంద్రగుప్త్ కోల్‌మైన్స్ లిమిటెడ్ అనే మూడు కంపెనీల ప్రధాన కార్యాలయం బంజారాహిల్స్‌లో ఉంది. సుశీ ఇన్‌ఫ్రా కంపెనీలో ఇద్దరు, అరుణాచల్ హైవేస్ లిమిటెడ్ కంపెనీలో నలుగురు, సుశీ చంద్రగుప్త్ కోల్‌మైన్స్‌లో ముగ్గురు చొప్పున.. మొత్తం తొమ్మిది మంది డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల ఇళ్లల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే.. అధికారులు ఇప్పటివరకు ఎలాంటి సమాచారాన్ని బయటపెట్టలేదు. మూడు గంటలపైనే ఈ సోదాలు సాగడం, ఇంకా డీటెయిల్స్ బహిర్గతం కాకపోవడం బట్టి చూస్తుంటే.. మంగళవారం కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.