Estimated flood damage in Telangana: రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు గోదావరి పరివాహక ప్రాంతాలతో పాటు ఉత్తర తెలంగాణలోని చాలా ప్రాంతాలు తీవ్ర నష్టాలకు గురయ్యాయి. గోదావరి నది పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాల్లోని పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా నిర్మల్, బైంసా, మంచిర్యాల, మంథని, రామగుండం, భద్రాచలం పట్టణాల్లోని చాలా కాలనీలు నీట మునిగి భారీ నష్టం వాటిల్లింది. రోడ్లు, భవణాలు, విద్యుత్ స్థంబాలు నెలకొరిగాయి. తాజాగా ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల తెలంగాణలో రూ. 1400 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం అంచానా వేసింది. వరద నష్టాలపై కేంద్రానికి నివేదిక కూడా అందించింది. తక్షణమే రూ. 1000 కోట్లు సాయం కింద విడుదల చేయాలని కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
Read Also: TRS vs BJP: మంచిర్యాల జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఘర్షణ
వరద నష్టం వివరాలు :
వరదల వల్ల కాజ్ వేలు, రోడ్లు కొట్టుకపోవడం తదితర కారణాల వల్ల రోడ్లు భవనాల శాఖ కు సంబంధించి రూ.498 కోట్ల నష్టం వాటిల్లింది. పంచాయితీ రాజ్ శాఖలో రూ.449 కోట్లు.. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రూ.33 కోట్లు.. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో రూ.379 కోట్లు.. విద్యుత్ శాఖలో రూ. 7 కోట్ల నష్టం వాటిల్లినట్టు ఆయా శాఖలు ప్రాథమిక అంచనాల ద్వారా నివేదికలు సిద్దం చేసి కేంద్రానికి అందచేశారు. అదే సందర్భంలో ఇండ్లు కూలిపోవడం ముంపునకు గురికావడం తో పాటు వారిని తరలించే క్రమంలో రూ.25 కోట్లు.. ఇంకా తదితర వరద నష్టాలు వెరసి మొత్తంగా రూ. 1400 కోట్ల మేరకు రాష్ట్రంలో వరద నష్టం సంభవించిందని అధికారులు నివేదికలు సిద్దం చేసి కేంద్రానికి పంపారు.