CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. రాష్ట్ర ప్రగతికి, పెట్టుబడుల ఆకర్షణకు అత్యంత కీలకంగా భావిస్తున్న తెలంగాణ ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్ (డిసెంబర్ 8, 9) కు ప్రముఖ నేతలను ఆహ్వానించేందుకు సీఎం, డిప్యూటీ సీఎంలు నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు.
ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ కానున్నారు. పార్లమెంట్ ప్రాంగణంలో జరిగే ఈ సమావేశంలో గ్లోబల్ సమ్మిట్ వివరాలు, దాని ప్రాముఖ్యతను వారికి వివరించనున్నారు. తెలంగాణను భవిష్యత్తు పెట్టుబడి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో జరుగుతున్న ఈ సమ్మిట్‌కు ప్రధానమంత్రి హాజరుకావాలని సీఎం ఆహ్వానించనున్నారు.
ఇది వరుస పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రధాన నేతలతో కూడా భేటీలు కొనసాగిస్తున్నారు. నిన్న రాత్రి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రాన్ని అధికారికంగా అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి అజెండా, సమ్మిట్ లక్ష్యాలను ఖర్గేకు వివరించినట్లు తెలుస్తోంది.
ఇక కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీతో కూడా భేటీ కావాలని సీఎం ప్రయత్నాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ సమ్మిట్‌కు హాజరు కావాలనే అభ్యర్థనను వ్యక్తిగతంగా తెలియజేయనున్నారు. అదేవిధంగా పలువురు కేంద్ర మంత్రులు, కీలక పార్లమెంటరీ నేతలు కూడా సమ్మిట్‌కు రావాలని ఆహ్వానించనున్నారు.
తెలంగాణ ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్‌ను అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పరిశ్రమల సంస్థలు, స్టార్టప్‌లు, ఇన్వెస్టర్లు ఈ సదస్సుకు హాజరయ్యే అవకాశముంది. పెట్టుబడులను తెలంగాణకు రప్పించే లక్ష్యంతో జరిగే ఈ గ్లోబల్ ఈవెంట్ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తోంది. ఢిల్లీ పర్యటనలో జరుగుతున్న ఈ భేటీలు, ఆహ్వానాలు మొత్తం వచ్చే సమ్మిట్ ప్రతిష్ఠను మరింత పెంచనున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.