తెలంగాణలో ప్రస్తుతం దళితబంధుపై ఆసక్తికర చర్చ సాగుతోంది. అర్హులైన పేద దళిత కుటుంబాలకు పది లక్షల ఆర్థిక సాయం ఇస్తామంటూ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే దీని విధివిధానాలపై ఆయా వర్గాలతో చర్చలు జరిపారు. దళిత బంధుని హుజూరాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు ఇవాళ జరిగే కేబినెట్ భేటీలోనే ముహూర్తం ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఇటీవల పలు దఫాలుగా దళితబంధుపై చర్చలు జరిపిన సర్కారు… ఈ పథకానికి తగిన మార్గదర్శకాలను రూపొందించడం, వీలైనంత తొందరగా అమలులోకి తీసుకురావడం, బడ్జెట్ కేటాయింపులు చేయడం తదితర అంశాలను మంత్రి వర్గంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. దళితవాడల్లోని సమస్యలు, అర్హుల జాబితాను అధికారులు సేకరిస్తున్నారు. మరోవైపు దళిత బీమాపై కూడా చర్చించనున్నారు.
ఇక చేనేతలకు బీమాపై సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన తరుణంలో దానిపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది. చేనేత బంధుపై సిరిసిల్లలో పర్యటించిన కేటీఆర్ సైతం త్వరలో ఈ స్కీం అమలు అవుతుందని స్పష్థం చేశారు. మరోవైపు 50 వేల ఉద్యోగాల భర్తీ అంశంపై కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. వీటితోపాటు పంటల సాగు, ప్రాజెక్టుల తదితర అంశాలపై చర్చించనుంది. కేంద్రం కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గెజిట్ విడుదల చేసిన అంశం కూడా కేబినెట్ ముందుకు రానుంది. అలాగే కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై కూడా మంత్రివర్గం చర్చించనుంది.