కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు ప్రవేశపెట్టిన ఆర్ధిక బడ్జెట్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ బడ్జెట్ పనికిమాలిన, పసలేని బడ్జెట్ అని ఆయన విమర్శలు చేశారు. అన్ని వర్గాలను ఈ బడ్జెట్ తీవ్రంగా నిరాశకు గురిచేసిందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు పెట్టుకున్న ఆశలపై ఈ బడ్జెట్ నీళ్లు చల్లిందని… వేతన జీవుల కోసం ఇంకమ్‌ట్యాక్స్ శ్లాబులలో మార్పులు చేయకపోవడం విచారకరమని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Also: ప్రధాని మోదీ మరో రికార్డు.. ఈ విషయంలో ఆయనే నంబర్‌వన్
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చదివి వినిపించిన బడ్జెట్ ప్రసంగం ఆసాంతం డొల్లతనంతో నిండి… మాటల గారడీతో కూడుకుందని కేసీఆర్ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, రైతులకు, పేదలకు, సామాన్యులకు, కుల వృత్తుల వారిని కూడా ఈ బడ్జెట్ నిరాశకు గురి చేసిందన్నారు. దశ, దిశ, నిర్దేశం లేని ఈ బడ్జెట్‌తో ఉపయోగం ఏమీ లేదన్నారు. బడ్జెట్ చాలా గొప్పగా ఉందంటూ కేంద్ర ప్రభుత్వం తమ జబ్బలు తామే చరుచుకుంటోందని కేసీఆర్ ఎద్దేవా చేశారు. దేశం కరోనా కష్టకాలంలో ఉందని… హెల్త్ కేర్ రంగాన్ని ప్రపంచమంతా అభివృద్ధి పరుస్తుంటే కేంద్రానికి ఆ సోయి లేకపోవడం దురదృష్టకరమన్నారు. దేశ ప్రజల ఆరోగ్యం కేంద్ర ప్రభుత్వానికి పట్టడం లేదని కేసీఆర్ విమర్శలు చేశారు.