దేశవ్యాప్తంగా ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాపై పెద్ద చర్చ సాగుతోంది.. వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందిన కాశ్మీరీ పండిట్ల బాధను చెప్పే ఈ చిత్రంపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా లేకపోలేదు.. దాదాపు 12 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే వంద కోట్లకు పైగా వసూలు చేసింది.. ఈ చిత్రంపై ప్రధాని నరేంద్ర మోడీ సైతం ప్రశంసలు కురిపించారు. అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ సినిమాపై మండిపడ్డారు.. ఇవాళ తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది.. ఈ భేటీలో తొలి సెషన్‌లో మాట్లాడిన కేసీఆర్.. కాశ్మీర్ ఫైల్స్ సినిమాను కూడా ప్రస్తావించారు..
Read Also: Bodhan Tension: బోధన్ అల్లర్ల వెనుక సంచలన విషయాలు.. కుట్ర అతడిదే..!
ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్.. దేశంలో సమస్యలు పక్కదారి పట్టించడానికే ఈ సినిమా విడుదల చేశారని ఆరోపించిన ఆయన.. కాశ్మీర్‌లో హిందూ పండిట్లను చంపినప్పుడు అధికారంలో ఉంది ఎవరు? అని ప్రశ్నించారు.. అప్పుడు బీజేపీ ప్రభుత్వమే అధికారంలో లేదా? అని నిలదీసిన కేసీఆర్.. రైతుల సమస్యలు పక్కద్రోవ పట్టించడానికి ఈ సినిమాను తెరపైకి తెచ్చారని విమర్శలు గుప్పించారు.. ఇక, దేశానికి కావాల్సింది కాశ్మీర్ ఫైల్స్ కాదు.. డెవలప్మెంట్ ఫైల్స్ అని సూచించారు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు. కాగా, ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూసిన తర్వాత కొంతమంది రెచ్చిపోతున్నట్టు కూడా వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.. ఈ సినిమా గాయాలను మాన్పుతుందా.? తిరిగి రేపుతుందా.? ద్వేషమనే బీజాలను మళ్లీ నాటుతుందా..? అంటూ ఈ మధ్యే సినీ నటుడు ప్రకాష్ రాజ్ ప్రశ్నించిన విషయం తెలిసిందే.