Talasani Srinivas Yadav Strong Counter To Opposition Leaders: ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రోడ్డు మీద కుక్కలు మొరుగుతుంటాయని.. వాటిని పట్టించుకోవద్దని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మనసున్న మారాజు అని కొనియాడారు. రాష్ట్రంలో కేసీఆర్ అమలు చేస్తోన్న రైతుభీమా, రైతుబంధు పథకాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా? అంటూ నిలదీశారు. వందల, వేల కోట్ల రూపాయలతో ఎన్నో కార్యక్రమాల్ని చేపడుతున్నామన్నారు. రాష్ట్రానికి వచ్చిన ప్రతి ఒక్కడు కేసీఆర్‌ని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని, అంతకుమించి చేసేదేమీ లేదని ఎద్దేవా చేశారు. తాము కూడా తిరిగి తిట్టగలమని హెచ్చరించారు. దళిత బంధు రాగానే మిగతా కులాల్ని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఏదైనా కార్యక్రమం జరిగితే చాలు, అక్కడికి వెళ్లి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని.. దీని వెనుక వేరే శక్తులున్నాయని మంత్రి తలసాని వెల్లడించారు. ఇక తెలంగాణ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి జరుపుకోవడం గర్వకారణమన్నారు.
అంతకుముందు సనత్ నగర్ డివిజన్‌లోని కంజర్ల లక్ష్మీనారాయణ (KLN) పార్క్‌ను సందర్శించిన మంత్రి తలసాని.. రూ. 3 కోట్ల వ్యయంతో మరింత ఆధునీకరిస్తామని తెలిపారు. వచ్చే నెల 11 వ తేదీన అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలోనే కేఎల్ఎన్ పార్క్ అతిపెద్దదని.. ఈ పార్క్‌కి వివిధ వయసులకు చెందిన వేలాది మంది నిత్యం వస్తుంటారని, వారిని దృష్టిలో పెట్టుకునే ఈ పార్క్‌లో అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు.