సాధారణంగా పిల్లలు వారి స్నేహితులు కొడితే తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తారు. అదే టీచర్లు కొడితే పశ్చాతాపం వ్యక్తం చేస్తారు. అయితే ఇప్పుడు కాలం మారిపోయింది. స్కూళ్లలో పిల్లలపై టీచర్ల దెబ్బపడితే అటు తల్లిదండ్రులు ఊరుకోవడం లేదు.. ఇటు పిల్లలు కూడా మాట వినడం లేదు. కానీ ఏకంగా టీచర్లపై ఓ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలోని ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్లపై ఏడేళ్ల బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బయ్యారంలోని నిర్మల ప్రైవేట్ స్కూల్‌లో అనిల్ అనే విద్యార్థి రెండో తరగతి చదువుతున్నాడు. ఏ కారణం లేకుండానే సన్నీ, వెంకట్ అనే టీచర్లు తనను కొట్టారంటూ అనిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను కొట్టిన టీచర్లపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్‌ఐ రమాదేవికి ఫిర్యాదు చేశాడు. అయితే బాలుడి ధైర్యాన్ని పోలీసులు మెచ్చుకున్నారు. స్కూల్‌కు వెళ్లి బాలుడిని కొట్టిన ఉపాధ్యాయులను పోలీసులు ప్రశ్నించారు. అనంతరం బాలుడిని పోలీసులు శాంతింపజేసి ఇలాంటి తప్పులు మళ్లీ జరగకుండా చూస్తామని తెలిపారు.