సీఎం కేసీఆర్ విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం సబితా ఇంద్రారెడ్డి పలు స్కూళ్లలో జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ పాఠశాలలను బాగుచేయాలని చూస్తున్నామని, అందులో భాగంగా విడతల వారీగా స్కూళ్ల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఆమె వెల్లడించారు. నిధులు కూడా కేటాయించామని, హాలియా స్కూల్ లో 70 శాతం పనులు పూర్తయ్యాయని ఆమె పేర్కొన్నారు.
అభివృద్ధి అంటే స్కూల్‌కి కలర్ మాత్రమే వేయడం కాదు.. ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ఉండేలా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆమె తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియం అందిస్తున్నామని, ఒకటి నుండి 8 వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్యను బోధించేందుకు ఏర్పాటు చేస్తు్న్నామన్నారు. ఇప్పటికే టీచర్లకు ట్రెయినింగ్ ఇచ్చామని తెలిపిన ఆమె.. ద్వి భాషలో పుస్తకాల ముద్రణ జరుగుతుందని పేర్కొన్నారు.
ఇబ్బందులు పడుతూ విద్యార్థులను ప్రైవేటు స్కూళ్లకు పంపొద్దని ఆమె సూచించారు. పేరెంట్స్ కూడా స్కూళ్ల విజిట్ చేయాలని, పిల్లలు ఏం చదువుతున్నారో తెలుసుకోవాలన్నారు. ఆమెతో పాటు హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన, ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఒమర్ జలీల్, ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ తదితరులు ఉన్నారు.