CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- అందెశ్రీ స్మృతివనానికి శంకుస్థాపన
- కేసీఆర్ కుటుంబంపై ఘాటు విమర్శలు
- 70 వేల ఉద్యోగాలపై కీలక వ్యాఖ్యలు
- 2034 వరకు కాంగ్రెస్ పాలనే: సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్లో ప్రముఖ ప్రజాకవి అందెశ్రీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అందెశ్రీ స్మృతివనం నిర్మాణానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భూమిపూజ చేసి, శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “గత పాలకులు అహంకారంతో అందెశ్రీ రాసిన పాటను నిర్బంధించాలని చూశారు. నాడు ఏ పాటను అయితే అణచివేయాలని చూశారో, నేడు అదే పాట ‘జయ జయహే తెలంగాణ’ అంటూ రాష్ట్ర అధికారిక గీతంగా నిలిచింది. ప్రజాకవులు అందెశ్రీ, గద్దర్ అన్నలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోతారని ఆనాడే చెప్పా, ఇవాళ అదే జరుగుతోంది” అని సీఎం వ్యాఖ్యానించారు.
అందెశ్రీ నా స్ఫూర్తి.. మా పెద్దన్న లాంటివారు
అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగంగా పంచుకున్నారు. “అందెశ్రీ నాకు ఆత్మబంధువు. నాడు నాపై గత పాలకులు అక్రమ కేసులు పెట్టి లొంగదీసుకోవాలని చూసినప్పుడు ఆయన మాటలే నాకు ధైర్యాన్ని ఇచ్చాయి. ఇవాళ నేను ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నానంటే నాలో స్ఫూర్తి నింపింది అందెశ్రీనే. ఆత్మగౌరవం ఉన్న ఆయన ఏనాడూ దొరల గడప తొక్కలేదు. మేము ఏడుగురం అన్నదమ్ములం, మా పెద్దన్న చనిపోయారు. ఇప్పుడు అందెశ్రీనే మా పెద్దన్నలా భావిస్తా” అని పేర్కొన్నారు. మొదట్లో రాజకీయ నాయకులను నమ్మక అందెశ్రీ తనను కలవడానికి ఇష్టపడలేదని, కానీ ఐదు నిమిషాల భేటీతో తామంతా ఏకమయ్యామని గుర్తుచేసుకున్నారు. తెలంగాణలో ప్రజాప్రతినిధులు వైఫల్యం చెందినప్పుడు విద్యార్థులే ఉద్యమాన్ని ముందుకు నడిపారని, పెన్నులపై మన్ను గప్పితే అవి గన్నులుగా మారుతాయని సీఎం హెచ్చరించారు.
Also Read
పదేళ్లు నిరుద్యోగులను ఏడ్పించి.. ఇప్పుడేమో చిల్లర మాటలా?
కేసీఆర్ ట్విట్టర్, ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్న మాటలపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. “మేము నోటిఫికేషన్ ఇస్తే రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇస్తున్నాడని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. మరి పదేళ్ల మీ పాలనలో ఆ ఉద్యోగాలను భర్తీ చేయాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు? 16 ఏళ్ల పాటు గ్రూప్-1 ఉద్యోగాలు వేయకుండా నిరుద్యోగులను కోచింగ్ సెంటర్ల చుట్టూ తిప్పింది ఎవరు? మీ చెల్లెలు కవిత ఎంపీగా ఓడిపోతే ఆరు నెలలు కాకముందే ఎమ్మెల్సీ చేశారు, వినోద్ కు ప్లానింగ్ కమిషన్ పదవి ఇచ్చారు, మీ ఇంట్లో అందరికీ పదవులు ఇచ్చుకున్నారు కానీ నిరుద్యోగ యువత మాత్రం మీకు గుర్తుకు రాలేదా?” అని నిలదీశారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దాదాపు 70 వేల ఉద్యోగాలు భర్తీ చేసి, ఆయా అభ్యర్థుల తల్లిదండ్రుల సమక్షంలో నియామక పత్రాలు అందించామని సీఎం స్పష్టం చేశారు.
తెలంగాణ తులసి వనం.. అందులో గంజాయి మొక్కలను మొలవనివ్వం
తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడటం తన బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. “తెలంగాణ సమాజం మీకు ఏం తక్కువ చేసింది? ఉద్యమ సమయంలో చెప్పులు లేకుండా తిరిగిన వాళ్లకు ఇవాళ బెంజ్ కార్లు వచ్చాయి. దుబాయ్ పాస్ పోర్ట్ బ్రోకర్‌గా ఉన్న వ్యక్తిని తెలంగాణ ప్రజలు సీఎంను చేశారు. అలాంటిది పదేళ్లలో నిజాం నవాబులా ధనవంతులుగా మారి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. మిమ్మల్ని ప్రజలు క్షమించారని అనుకుంటున్నారా? నన్ను తిట్టినంత మాత్రాన ప్రజలు మిమ్మల్ని నమ్మరు. గజ్వేల్‌లోనే కేసీఆర్‌ను రాజకీయంగా సమాధి చేసే బాధ్యతను మన యువత తీసుకుంటుంది” అని హెచ్చరించారు. తులసి వనం లాంటి తెలంగాణలో గంజాయి మొక్కల లాంటి కేసీఆర్ కుటుంబాన్ని మళ్లీ మొలకెత్తనివ్వనని భీష్మించారు.
శ్రీకాంతాచారి తల్లిని కాదని.. కవితకు పదవులా
తెలంగాణ మలిదశ ఉద్యమ అమరవీరుడు శ్రీకాంతాచారి త్యాగాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. “ఒక తల్లి కొడుకు కాలిన నిప్పులా శవమై ఇంటికి వస్తే ఆ తల్లి దుఃఖం కేసీఆర్‌కు కనిపించలేదు. ఆత్మహత్యల పునాదులపై అధికారం పీఠం ఎక్కిన కేసీఆర్.. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా తన సొంత చెల్లెలికి ఇచ్చుకున్నారు. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం శంకరమ్మను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించి గౌరవించింది” అని తెలిపారు. తెలంగాణకు పట్టిన దరిద్రం పోవడానికి ఆనాడే ఎవరో ఒకరు అగ్గిపెట్టె ఇచ్చి ఉంటే బాగుండేదని ఎద్దేవా చేశారు.
చివరగా, నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఖాళీని భర్తీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వచ్చే పదేళ్ల పాటు, అంటే 2034 వరకు తమ ప్రజా పాలనే అధికారంలో ఉంటుందని.. కేసీఆర్ కుటుంబానికి గతమే తప్ప, తెలంగాణలో భవిష్యత్తు లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?