Revanth Reddy: ప్రజలు సీఎం కేసీఆర్ కు ఇచ్చిన అవకాశం ముగిసిందని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రం విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, రైతులకు 24 గంటల విద్యుత్ పై కేసీఆర్ ఆడంబరపు ప్రకటనలు ఇచ్చారని మండిపడ్డారు. ఆనాడు బషీర్ బాగ్ విద్యుత్ ఉద్యమంతో ప్రభుత్వం కూలిపోయిందని గుర్తు చేశారు. ప్రైవేటు విద్యుత్ సంస్థల్లో 50 శాతం కమిషన్లు దండుకున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు రూ.20 వేలకోట్ల బాకాయి పడిందని, ట్రాన్స్ కో, జెన్ కో కలిపి 60వేల కోట్ల అప్పుల్లో మునిగిపోయాయని తెలిపారు. కేసీఆర్ ధనదాహం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందంటూ రేవంత్ రెడ్ది ఆరోపించారు.
విద్యుత్ కొనుగోళ్లలో వేల కోట్ల కుంభకోణం జరిగిందని.. కమీషన్లు, కాసుల కక్కుర్తితోనే నమ్మిన బండ్ల వద్ద విద్యుత్ కొనుగోలు చేశారని అన్నారు. ఛత్తీస్ గఢ్ విద్యుత్ ఒప్పందం లోపాలు ఉన్నాయని గతంలో ఉద్యోగి రఘు ఫిర్యాదు చేశారు, దీన్ని ఒప్పుకోని అధికారిని కేసీఆర్ బదిలీ చేశారని అన్నారు. గుజరాత్ కంపెనీతో వెయ్యి కోట్లు లంచం తీసుకుని కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని కొన్నారని, దాదాపు 10వేల కోట్లు అప్పు భారం జెన్ కో, ట్రాన్స్ కో మీద పెట్టారని విమర్శించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ టెండర్ లేకుండా బీహెచ్ఈఎల్ కు అప్పగించారని, సివిల్ వర్క్ ను సొంత కాంట్రాక్టర్లకు ఇప్పించి వేల కోట్లు దోచుకున్నారని కేసీఆర్ పై ఆరోపణలు గుప్పించారు.
Read Also: Turkey Earthquake: కన్నీరు పెళ్లిస్తున్న ఓ తండ్రి ఫోటో..తీవ్ర భావోద్వేగానికి గురైన ఫోటోగ్రాఫర్
భద్రాద్రి కోసం రూ. 10 వేల కోట్లు, యాదాద్రి కోసం రూ. 35 వేల కోట్లు అప్పుతెచ్చారని , స్థాయి అనుభవం లేని అధికారులకు బాధ్యతలు అప్పగించారని అన్నారు. చిన్న ఉద్యోగాలు చేసి, రిటైర్ అయిన ప్రభాకర్ రావును జెన్ కో కు సీ ఎండీగా నియమించారని,
దోపీడికి సహకరించిన ప్రభాకర్ రావుకు, రఘుమా రెడ్డికి ఉన్నతమైన బాధ్యతలు అప్పగించారని దీంతోనే విద్యుత్ సంస్థలు కుప్పకూలిపోయాని ఆరోపించారు రేవంత్ రెడ్డి.
రైతులు తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని.. 2014 నుంచి విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరపాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలు ఎవరూ ఏడీసీ ఛార్జీలు కట్టవద్దని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడీసీ ఛార్జీలను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. బషీర్ బాగ్ లాంటి ఉద్యమాన్ని మరోసారి తేవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈఆర్సీపై సరైన నిర్ణయం తీసుకోకుంటే విద్యుత్ సౌధను ముట్టడిస్తామన్నారు.