CM Revanth Reddy : కేరళలోని అలెప్పీ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఒక విశేషమైన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సేవలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఘనంగా సత్కరించారు. ఆయన మాటల్లో, వేణుగోపాల్ గారు కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, పేదల కోసం, అణగారిన వర్గాల కోసం ఎప్పటికప్పుడు పోరాడుతూ ప్రజలకు నిజమైన గొంతుకగా నిలుస్తున్న అసామాన్య వ్యక్తి. 2006లో ఆయన ప్రారంభించిన పొంథువల్ (ఎంపీ) మెరిట్ అవార్డులు సమాజంలో విద్యా ప్రోత్సాహానికి మార్గదర్శకంగా నిలిచాయని గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఈ అవార్డుల ప్రాముఖ్యతను వివరించారు. “ఈ రోజు 150 పాఠశాలల నుండి 3,500 మందికి పైగా విద్యార్థులు ఈ అవార్డులు అందుకుంటున్నారు. విద్యార్థులను ప్రోత్సహించే ఈ కార్యక్రమం కేవలం కేరళలోనే కాకుండా దేశమంతటా ఆదర్శంగా నిలవాలి,” అని ఆయన అన్నారు. విద్య ప్రాధాన్యతపై మాట్లాడిన రేవంత్ రెడ్డి, “విద్య అనేది మనిషికి లభించే అత్యంత గొప్ప బహుమతి మాత్రమే కాదు, సమాజాన్ని ముందుకు నడిపించే శక్తివంతమైన ఆయుధం కూడా. సమాజంలో సమానత్వం తీసుకురావడానికి, పేదరికాన్ని దూరం చేయడానికి విద్యే ప్రధాన మార్గం,” అని పేర్కొన్నారు. కేరళలో పదో, పన్నెండో తరగతుల తర్వాత విద్యార్థుల డ్రాప్ అవుట్స్ శాతం సున్నాగా ఉండటం దేశమంతటికి ఆదర్శమని ఆయన అభినందించారు.
అలాగే, తెలంగాణలో కూడా విద్యా రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. పాఠశాలల మౌలిక సదుపాయాల నుండి ఉన్నత విద్యా అవకాశాల వరకు సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నామని, భవిష్యత్తు భారత్కు బలం కావాల్సిన యువతను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. “యువతే రేపటి దేశ భవిష్యత్తు. వారికి సమాన అవకాశాలు కల్పించడంలో విద్యే ప్రధాన ఆధారం. ఈ దిశగా తెలంగాణలో ప్రతి పిల్లవాడికి నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకుంటున్నాం,” అని రేవంత్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ప్రారంభించిన విద్యా అవార్డులను ప్రస్తావించడం ద్వారా రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో విద్యపై ఉన్న కట్టుబాటు, కేరళ మోడల్ పట్ల ఉన్న గౌరవాన్ని మరోసారి చాటుకున్నారు. ఈ సందర్బంగా ఆయన ప్రసంగం అక్కడి విద్యార్థుల్లో, ఉపాధ్యాయుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.