MLC Kavitha : తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీపై భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. “ఎన్నికల సమయంలోనే కనిపించే గాంధీ ఇప్పుడు తెలంగాణకు వచ్చారు. ఆయనను స్వాగతించాల్సిందే… ఎందుకంటే మళ్లీ కనిపించేది ఎన్నికలపూటే” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కవిత తెలిపిన వివరాల ప్రకారం, రాహుల్ గాంధీ ఇప్పటివరకు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ మోసపూరితంగా నిలిచాయని విమర్శించారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను ఆకర్షించిన కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా ఏ ఒక్క హామీను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని చెప్పిన వాగ్దానం కేవలం అర్థాంతరంగా నిలిచిందని, మహిళలకు తులం బంగారం, నెలకు రూ.2500 ఇస్తామన్న హామీలు కనిపించకుండా పోయాయని కవిత ఆరోపించారు.
అంతేకాదు, రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులపై రాహుల్ గాంధీ ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. ఇటీవల హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులపై జరిగిన లాఠీ దాడులను, లగచర్లలో బంజారా మహిళలపై జరిగిన అఘాయిత్యాలను గుర్తుచేస్తూ, ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలన వైఫల్యాలకు నిదర్శనాలని ఆమె పేర్కొన్నారు. ఈ దాడులన్నింటిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించిందని గుర్తు చేశారు. సామాన్య ప్రజలు సోషల్ మీడియాలో “కరెంట్ లేదు” అని పోస్ట్ చేస్తే వారిపై కేసులు పెడుతున్న పరిస్థితిలో, తెలంగాణ ప్రజలు నిజమైన ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నారని కవిత తెలిపారు. గ్రూప్-1 పరీక్షల ఆలస్యంపై విద్యార్థులు ఆందోళన చేస్తున్నా, కాంగ్రెస్ నాయకత్వం మౌనంగా ఉండటం దారుణమని విమర్శించారు.
“రాహుల్ గాంధీ ఎర్ర బుక్ పట్టుకుని దేశమంతా తిరుగుతారు, కానీ తెలంగాణలో రాజ్యాంగ విలువలు తుడిచిపెట్టే చర్యలపై మాత్రం ఒక్క మాట కూడా చెప్పడం లేదు. ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచేలా ఉంది,” అని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాహుల్ గాంధీకి తీవ్రంగా సవాల్ విసిరిన కవిత, తెలంగాణ ప్రజలు నిజాన్ని తెలుసుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేర్చబోతున్నారన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.