కొందరు టీఆర్ఎస్ నేతలు, మంత్రులు నోటికి ఎంతోస్తే అంత మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఐటీ మంత్రి చైనాను పొగుతున్నారని.. అక్కడ ఉన్నది మిలిటరీ రూల్ అని తెలుసుకోవాలని హితవు పలికారు. ప్రధాన మంత్రి గురించి ఇక్కడ మాట్లాడినట్లు అక్కడ మాట్లాడితే ఊరుకోరని అన్నారు. కరోనాతో చనిపోయిన వారి లెక్కలు కూడా చైనా చెప్పదని.. చైనా ప్రభుత్వం చెప్పిందే రాసుకోవాలని తెలిపారు.
కేటీఆర్ గొప్పగా చెబుతున్న చైనాలో ముస్లింలను చంపుతున్నారని.. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ప్రవర్తిస్తే చంపేస్తారని గుర్తుంచుకోవాలని అన్నారు. చైనా వెళ్లి మాట్లాడాలి అప్పుడు తెలుస్తుందంటూ సెటైర్లు వేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కేటీఆర్ అర్థం చేసుకుని మాట్లాడాలని సూచించారు. చైనాలో ఉన్న మిలిటరీ రూల్ ను ఇక్కడ కోరుకుంటున్నారా..? అని ప్రశ్నించారు.
బామ్మర్ది ఇలా మాట్లాడితే బావ ఇంకోలా మాట్లాడుతున్నాడని హరీష్ రావును విమర్శించారు రఘునందన్ రావు. 2 లక్షల 50 వేల కోట్ల బడ్జెట్ లో కేంద్రం నుంచి 5 వేల కోట్లు రాకపోతే ఏంటి హరీష్ రావు.? అని ప్రశ్నించారు. కేంద్రం అన్ని రాష్ట్రాలకు నిధులు విడుదల చేసింది..అది హరీష్ రావు తెలుసుకోవాలని సూచించారు. అభివృద్ధి పై మాట్లాడకుండా కేంద్రం పై విమర్శలు చేస్తున్నారంటూ విమర్శలు చేశారు.
చైనాతో ఎందుకు పోల్చుకుంటున్నారు.. తెలంగాణలో మేమే అధికారంలో ఉంటాం అని అనుకుంటున్నారా..? అంటూ మంత్రులను ప్రశ్నించారు. కల్వకుంట్ల రాజ్యాంగం పక్కకు పెట్టి అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయడం కోసం బీజేపీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని రఘునందన్ రావు అన్నారు. హైదరాబాద్ లో జరగబోయే బీజేపీ కార్యవర్గ సమావేశంలో కేంద్ర క్యాబినెల్ లోని 40 మంది పాల్గొంటారని.. వచ్చే నెల 2,3 తేదీల్లో కార్యవర్గ సమావేశం జరుగుతుందని అన్నారు.
..