R.Krishnaiah : తెలంగాణలో బీసీల హక్కుల కోసం నడుస్తున్న ఉద్యమానికి మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చర్యలు ముమ్మరం చేశారు. బీసీ ఉద్యమ నేత, బీజేపీ ఎంపీ ఆర్. కృష్ణయ్యను ఆమె హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి, జూలై 17 జరగనున్న జాగృతి రైల్ రోకోకు మద్దతు ఇవ్వాలంటూ కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “తెలంగాణ జాగృతి తరఫున మేము బీసీల కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా ఆర్.కృష్ణయ్య గారిని కలిసాము. కాంగ్రెస్ ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయాలన్న డిమాండ్‌తో మేము ఉద్యమం చేపట్టాం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో రెండు బిల్లులను ప్రవేశపెట్టింది. అయితే బిల్లులు పాస్ చేసి, రాష్ట్రపతికి పంపించామని చెప్పి చేతులు దులుపుకుంటోంది,” అని విమర్శించారు.
అంతేకాకుండా.. రేపు జరగనున్న క్యాబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో నిర్ణయం లేకుండా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం అన్యాయమని స్పష్టం చేశారు. ‘ఔర్ ఎక్ దక్కా.. బీసీ బిల్లు పక్కా’ అనే నినాదంతో నిర్వహించనున్న రైల్ రోకో కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని కృష్ణయ్యను కోరినట్లు తెలిపారు.
SSMB 29 : మహేశ్ ఎంట్రీ సీక్వెన్స్ పై రాజమౌళి గ్రాండ్ ప్లాన్!
ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీల రిజర్వేషన్ల కోసం అన్ని రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాలు మద్దతు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి బీసీల పట్ల నిజమైన చిత్తశుద్ధి లేదని, బిల్లులు పాస్ చేశారన్న మాటలు చెబుతున్నారు కానీ అమలు చేసే ప్రయత్నం లేదు అని పేర్కొన్నారు.
అంతేకాక.. కవిత బీసీ కాకపోయినా, బీసీల కోసం పోరాటం చేస్తున్నారన్నారు. ఇది గమనించదగ్గ విషయమని, బీసీలు ఇప్పుడు మౌనం వహిస్తే, ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను కూడా కోల్పోవాల్సి వస్తుందన్నారు. 75 ఏళ్లుగా బీసీలపై జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొనాల్సిన సమయం ఇది అని, ఉద్యమం చేయకపోతే హక్కులు రాదని గుర్తించాలి అని ప్రజలకు సూచించారు.
జూలై 17న జరగనున్న జాగృతి రైల్ రోకో కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నట్లు ఆర్.కృష్ణయ్య స్పష్టంగా తెలిపారు. బీసీల హక్కుల కోసం ఎవరు పోరాటం చేసినా, అందరికీ మద్దతు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు ఆర్.కృష్ణయ్య. లేకపోతే ప్రజల మద్దతుతో పెద్ద స్థాయిలో ఉద్యమం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశం బీసీ ఉద్యమానికి మరింత ఉత్సాహాన్నిస్తుందన్నది స్పష్టంగా కనిపిస్తోందని, పార్టీ పరమైన విభేదాలను పక్కన పెట్టి, హక్కుల కోసం ఒకే తాటిపైకి వచ్చే ప్రయత్నానికి ఇది నిదర్శనమన్నారు.
Ghee Benefits : నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా ? డాక్టర్స్ ఏమంటున్నారంటే..