తీన్మార్ మల్లన్న కేటీఆర్ కొడుకు హిమాన్షుపై అనుచిత పోల్ నిర్వహించడంపై టీఆర్ఎస్ మంత్రులు ఒక్కొక్కరుగా స్పందిస్తూ ..మల్లన్నను హెచ్చరిస్తున్నారు. కాగా తాజాగా ఇప్పటికే కేటీఆర్ మల్లన్న పై కేసు కూడ నమోదు చేశారు. మరోవైపు ఈ అంశాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ నేతలకు ట్విట్టర్ ద్వారా ట్యాగ్ చేసిన విషయం తెల్సిందే.. అయితే ఈ అంశంపై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పందిస్తూ కొందరు బుద్ధి లేకుండా చిన్న పిల్లలపై అత్యంత నీచంగా మాట్లాడుతున్నారని, తాము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టే సహనంతో ఉన్నామన్నారు.
అటు ధాన్యం కొనుగోళ్లపై కేంద్రానిది అసత్య ప్రచారమని విమర్శించారు. బండి సంజయ్ ఎందుకు దీక్ష చేస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా బీజేపీ నేతలు దిగజారుడు విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. అనవసరమైన విమర్శలకు దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. ప్రజల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ఎన్నో పథకాలు తీసుకొచ్చిందని ఈ సందర్భంగా పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు.
తీన్మార్ మల్లన్న మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ఖమ్మం టూటౌన్ పీఎస్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో యువజన విభాగం నేతలు సీఐ శ్రీధర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తీన్మార్ మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణ చైతన్యతో పాటు నగర యువజన విభాగం అధ్యక్షుడు దేవభక్తుని కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి మాటేటి. కిరణ్ కుమార్, ఉపాధ్యక్షులు బలుసు. మురళీకృష్ణ, సరిపుడి గోపి సందేశ్, శీలం శ్రీనివాస్, పవన్, ఉదయ్, రాంబాబు, ఫిరోజ్, షాకీర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.