Prior Arrests By The Police In Telangana Over PM Modi Tour: ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకూడదన్న ఉద్దేశంతో.. పోలీసులు రంగంలోకి దిగి, ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. మోడీ పర్యటనకు వ్యతిరేకంగా పిలుపునివ్వడంతో పాటు రామగుండంలో మోడీ నిర్వహించబోయే కార్యక్రమాన్ని అడ్డుకుంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పడంతో.. ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు ఏఐటీయూసీ కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ, ఏఐవైఎఫ్ నేత వలీ ఉల్లాఖాద్రీని అరెస్ట్ చేశారు. అలాగే.. పారిశ్రామిక బంద్‌కు పిలుపునిచ్చిన సింగరేణి కార్మిక సంఘాల నాయకుల్ని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. బొగ్గు పరిశ్రమల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే6 గని వద్ద సింగరేణి కార్మికులు నల్ల జెండాలు ప్రదర్శిస్తూ, ‘మోడీ గో బ్యాక్’ నినాదంతో నిరసన వ్యక్తం చేశారు.
కాగా.. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు ప్రధాని మోడీ నేడు తెలంగాణకు విచ్చేస్తున్నారు. ఈ తరుణంలో భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఎస్‌పీజీ, ఎన్ఎస్‌జీ, ఎన్‌డీఆర్ఎఫ్ బలగాలను మోహరించారు. సివిల్ విభాగం నుండి 300 పోలీస్ అధికారులతో పాటు 2650 మంది పోలీస్ సిబ్బందిని రంగంలోకి దింపారు. ఇద్దరు సీపీలు, ఎనిమిది ఏసీపీల పర్యవేక్షణలో ఈ భద్రతా ఏర్పాట్లను నిర్వహించారు. మరోవైపు.. ఎన్‌టీపీసీ టౌన్‌షిప్ నుండి ఆర్ఎఫ్‌సీఎల్ ప్లాంట్‌కు నేరుగా వెళ్లేందుకు ఒక ప్రత్యేక ద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఆర్ఎఫ్‌సిఎల్ ప్రారంభించిన తర్వాత.. వర్చువల్ ద్వారా కొత్తగూడెం నుంచి సత్తుపల్లి రైల్వే లైన్‌ను మోడీ ప్రారంభించనున్నారు. అనంతరం.. పలు జాతీయ రహదారుల విస్తరణ శంకుస్థాపనలలోనూ మోడీ పాల్గొననున్నారు.