తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక హీట్ పెంచుతోంది.. ఈ ఉప ఎన్నిక ప్రధాన పార్టీలకు అగ్నిపరీక్షగా మారింది. సాధారణ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో ఇక్కడ గెలిచి రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళ్లాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. దీంతో మునుగోడు ఉప ఎన్నికకు ప్రాధాన్యం ఏర్పడింది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెబుతున్న బీజేపీ.. మునుగోడులో ఎట్టి పరిస్థితుల్లో నెగ్గి తీరాలని పట్టుదలగా ఉంది. మునుగొడులో గెలవడం ద్వారా తెలంగాణలో తిరుగులేని శక్తిగా నిరూపించుకోవాల్సిన పరిస్థితిలో ఉంది టీఆర్ఎస్. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరోలా ఉంది. సిట్టింగ్ స్థానాన్ని బైపోల్‌లో కాపాడుకోలేకపోతే… పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. మూడు ప్రధాన పార్టీలు మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జనంలోకి వెళ్లి ఓట్లను రాబట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.
Read Also: Astrology : సెప్టెంబర్ 30, శుక్రవారం దినఫలాలు
కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి… కాంగ్రెస్ క్యాడర్‌ను తనవైపు తిప్పుకునే యత్నాలు చేస్తున్నారు. మరోవైపు… బీజేపీ, టీఆర్‌ఎస్ తమ పార్టీలోకి వచ్చే నేతలకు పదవులు, హోదాలు వంటి ఆఫర్లిస్తున్నాయి. ప్రధాన పార్టీలు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొవడంతో మునుగొడులో పార్టీలు నేతలకు వాళ్ల స్దాయిని బట్టి ధరలు నిర్ణయించింది. తమ పార్టీలోకి రావలంటూ ఆహ్వానాలు పంపుతున్నాయి. వార్డ్ సభ్యునికి లక్ష, ఎంపీటీసీకి 10 లక్షలు, సర్పంచ్ కు 20 లక్షలు, ఎంపీపీలకు 50 లక్షలు, జడ్పిటిసిలకు కోటి రూపాయల వరకు ఇస్తామంటూ ఆహ్వానిస్తున్నాయి ప్రధాన పార్టీలు. దీంతో ముందు-వెనుక చూసుకోకుండా పార్టీ కండువాలను మార్చేస్తున్నారు. మునుగోడ్ ఉప ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ విడుదల కాకముందే ఉంటే… మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందనే చర్చ నడుస్తోంది.