గత కొన్ని రోజులుగా ఏవోబీ బార్డర్ జరుతున్న ఘటనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అంతే కాకుండా హిద్మా కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయం భయంగా గడుపు తున్నారు. ఓవైపు పోలీసులు మరో వైపు మావోయిస్టులతో గిరిజన ప్రజలకు దినదిన గండంగా మారుతుంది. తాజాగా పట్ట పగలే మావో యిస్టుల వాల్ పోస్టర్లు కలకలం రేపాయి ఈ ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. భీమదేవరకొండ అమర వీరులకు జోహార్లు అంటూ మావోలు పట్ట పగలే వాల్ పోస్టర్లను అంటించారు. ములుగు జిల్లా వెంకటాపురం- విజయపూరి కాలనీ గ్రామ సమీపంలోని భద్రాచలం- వెంకటాపురం జాతీయ రహదారిపై ఈ మావోయిస్టుల వాల్ పోస్టర్ల లేఖలు వెలిశాయని స్థానికులు తెలిపారు. దీనిపై పోలీసులు వారి పోస్టర్లు ఇక్కడ ఎలా వెలిశాయని స్థానికులను విచారిస్తున్నారు.
ఇప్పటికే మావోలు ఉనికి చాటుకోవడం కోసం ఏజెన్సీలోని గిరిజన గ్రామాలను టార్గెట్‌గా చేసుకుంటున్నారు. మరో వైపు పోలీసులు మావోయిస్టులు వస్తే సమాచారం అందజేయాలని గిరిజన గ్రామ ప్రజలను కోరుతున్నారు. కానీ, అటు మావోలు ఇటు పోలీసుల మధ్యలో అమాయక గిరిజనులు బలవుతున్నారని పలు హక్కుల సంఘాల నాయకులు అంటున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఆయా సంఘాల నేతలు కోరుతున్నారు.