హైదరాబాద్ నగరంలోని లిబర్టీ వద్ద జీహెచ్‌ఎంసీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో బీజేపీ కార్పొరేటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫర్నీచర్, పూలకుండీలు ధ్వంసం చేసినందుకు 10 మంది కార్పొరేటర్లపై కేసులు నమోదయ్యాయి. కాగా జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలంటూ మంగళవారం మధ్యాహ్నం జీహెచ్‌ఎంసీ ఆఫీస్ వద్ద బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ ఛాంబర్‌లో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని బీజేపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. ఎన్నికల కోడ్ ఉన్నందున సమావేశం నిర్వహించలేమని అధికారులు బీజేపీ నేతలకు సూచించారు.
Read Also: సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు లైన్ క్లియర్.. మరో పిటిషన్ కొట్టివేత
అయితే అధికారులు చెప్పినా పట్టించుకోకుండా మేయర్ ఛాంబర్‌లోకి బీజేపీ కార్పొరేటర్లు చొచ్చుకెళ్లి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారని అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూలకుండీలను కూడా ధ్వంసం చేశారని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి బీజేపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.