ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రక్షక భటులే భక్షక భటులై అర్ధ రాత్రి రోడ్డు పై వెళ్తున్న భార్యాభర్తల పట్ల అమర్యాదగా, దురుసుగా ప్రవర్తించిన తీరు పలు విమర్శలకు తావిస్తోంది.. తాము భార్యాభర్తలమని చెప్పినా కనికరించలేదు. సంబంధం లేని ప్రశ్నలతో పవిత్ర బందాన్ని అభాసు పాలు చేశారు. ఈ సంఘటన నేలకొండపల్లిలో చోటుచేసుకుంది.రాజకీయ బలంతో పాటు అంగబలం, అర్థబలం ఉన్న వారి అడుగులకు మడుగులొత్తే పోలీసులు సామాన్య ప్రజానీకంపై మాత్రం వారి జులుం ప్రదర్శించడం విడ్డూరం.
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కమలాపురం గ్రామానికి చెందిన బొమ్మగాని దుర్గారావు అతని భార్య భవానీ హైదరాబాద్ లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. తమ కుటుంబ సభ్యులను చూసేందుకు భార్యభర్తలతో పాటు భవానీ సోదరుడు వెంకటేష్ తో కలిసి హైదరాబాద్ నుంచి తమ స్వగ్రామం కమలాపురం వస్తున్నారు. నేలకొండపల్లి చేరుకునే సరికి సుమారు రాత్రి 12.20 అయింది. ఆ సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు వారిని ఆపి సంబంధం లేని ప్రశ్నలతో ఇబ్బందులకు గురి చేశారు. ఈ సమయంలో తిరగడం ఏంటి? నీది ఏ కులం, బస్సు టికెట్లు చూపించాలంటూ నిలదీశారు. బైక్ పై వస్తున్నామని చెప్పారు. ఈమె నీ భార్య అనీ, అతను నీ భర్త అని గ్యారంటీ ఏంటని హేళనగా మాట్లాడారు. పెళ్లి ఫోటోలు, తాళి బొట్టు చూపించినా కనికరించకుండా సుమారు అర గంట పాటు వారిని మనో వేదనకు గురిచేశారు.
తాము ఎన్ని చెప్పినా వినిపించుకోకుండా అరగంట పాటు నడి రోడ్డుపై నిలబెట్టి అమర్యాదగా ప్రవర్తించిన పెట్రోలింగ్ పోలీసుల పై మంత్రి కేటీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎంవోతో పాటు జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ కు బాధితులు దుర్గారావు, భవానీ ట్విట్టర్ లో ఫిర్యాదు చేశారు. అలాగే ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్ కు ఫిర్యాదు చేసేందుకు సీపీ కార్యాలయానికి వెళ్లారు.
రాత్రి పూట పెట్రోలింగ్ నిర్వహించే పోలీసు సిబ్బంది చీకటి వ్యాపారులతో ఒప్పందాలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిషేధిత గుట్కా, అంబర్ తో పాటు బియ్యం అక్రమ రవాణాదారుల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అలాగే వాహనాలు ఆపి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసు వ్యవస్థకే మచ్చ తెస్తున్న ఇలాంటి వారిపై చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
Police Corruption: పేకాట రాయుళ్ల పట్టివేతలో పోలీసుల చేతివాటం