తెలంగాణలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రసంగించారు. మోదీ మార్గదర్శకంలో తెలంగాణలోనూ భాజపా సర్కారు వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిని భాజపా కాంక్షిస్తోందన్నారు. కేసీఆర్‌కు జవాబు ఇచ్చేందుకు భారీసంఖ్యలో భాజపా శ్రేణులు తరలివచ్చాయని పీయూష్ గోయల్ వెల్లడించారు. తెరాస ప్రభుత్వ పాలనలో ప్రజలు బాధతో ఉన్నారని.. గులాబీ సర్కారుపై వ్యతిరేకత గ్రామగ్రామాన కనిపిస్తోందన్నారు. అవినీతి, కుటుంబపాలన, బుజ్జగింపులను ఇక తెలంగాణ భరించదన్నారు. తెలంగాణ ప్రజలకు అవినీతిరహిత ప్రభుత్వం కావాలని ఆయన అన్నారు. అలాంటి ప్రభుత్వం భాజపాతోనే సాధ్యమన్నారు. భాజపా ప్రభుత్వం కావాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. జీహెచ్‌ఎంసీలో బీజేపీకి వచ్చిన 50 సీట్లు ట్రైలర్ మాత్రమేననన్నారు. తెలంగాణలోని అనేక ప్రాజెక్టుల్లో అవినీతి జరుగుతోందని పీయూష్ గోయల్ ఆరోపించారు.
Bandi Sanjay : గడీ పాలనను బద్దలు కొట్టి తెలంగాణ తల్లికి విముక్తి చేస్తాం
తెలంగాణ ప్రజలు ఇక అవినీతిని సహించలేరని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అన్నారు. బుజ్జగింపు రాజకీయాలు తెలంగాణలో ఇక సాగవన్నారు. మార్పు తుఫాన్ వేగంతో తెలంగాణ అంతటా కనిపిస్తోందన్నారు. మంచి పాలనను తెలంగాణ ప్రజలు కోరకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో 8 ఏళ్లుగా అవినీతి పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, యువత కష్టాలు ఎదుర్కొంటోందన్నారు. తెలంగాణకు ఇప్పుడు ఉన్నది ఒక్కటే ప్రత్యామ్నాయమని, ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ నిలుస్తోందన్నారు. తన ప్రభుత్వం చేజారిపోతోందని కేసీఆర్‌కు అర్థమవుతోందన్నారు. తెలంగాణలో మార్పు రావడం సహజమన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా ఓ గిరిజన నేత అయిన ద్రౌపది ముర్ముకు బీజేపీ అవకాశం కల్పించిందన్నారు. ఈ నెల 18న జరిగే ఎన్నికల్లో ఆమె గెలిచి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.