కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్మలాటలు, నేతల మధ్య వర్గపోరు, అవి బహిర్గతం అవ్వడం.. ఆ తర్వాత సర్దుకుపోవడం.. ఎన్నికల సమయంలో కలిసి పనిచేయడం.. కొన్ని సార్లు మంచి ఫలితాలు వస్తే.. మరికొన్ని సార్లు నష్టపోవడం.. చూస్తూనే ఉన్నాం.. అయితే, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్త కమిటీల నియామకం చిచ్చుపెడుతోంది.. కొత్త కమిటీల్లో ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలను పక్కనబెట్టి.. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.. ఈ వ్యవహారంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు.. ఈ పరిస్థితులకు నిరసనగా ఇప్పటికే పలువురు పార్టీ పదవులకు రాజీనామా చేస్తే.. సీనియర్లు సమావేశం కావడం.. పీసీసీ కమిటీలపై బహిరంగంగానే మాట్లాడుతుండడం.. గందరగోళానికి దారితీసింది.. తాజాగా కాంగ్రెస్ అసమ్మతి నేతలంతా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంట్లో సమావేశమయ్యారు.. ఆ సమావేశానికి మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీ, దామోదరం రాజనరసింహ, జగ్గారెడ్డి, మహేశ్వర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇక, రేవంత్‌పై ఆదినుంచి అసంతృప్తితో ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. సీఎల్పీ నేత భట్టికి పోటీ చేసి.. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే.. నేను రెడీ అని చెప్పడంతో.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు అంతా ఏకమై.. సేవ్ కాంగ్రెస్ నినాదం ఎత్తుకున్నారు.. అసలైన కాంగ్రెస్ మాదే అంటున్నారు.. దీంతో.. ఏం జరగబోతోంది? అనేది ఆసక్తికరంగా మారింది.
Read Also: Rashmika New Role : తొలిసారి ఛాలెంజింగ్ రోల్ చేస్తున్న రష్మిక
పార్టీలో తాజా పరిస్థితిపై సీరియస్‌గా స్పందించారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.. కాంగ్రెస్ పార్టీని వేరే వాళ్లకు అప్పజెప్పే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించిన ఆయన.. పార్టీని కాపాడేందుకు సేవ్ కాంగ్రెస్ కార్యక్రమం చేపట్టనున్నట్టు వెల్లడించారు.. పార్టీని నమ్ముకొని పని చేసినవారికి కమిటీల్లో అవకాశం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ విషయంలో తాను తీవ్ర మనస్థాపానికి గురయ్యాయని.. సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు.. పార్టీలోని సీనియర్ నేతలను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారని కొందరు నేతలు తనతో చెప్పారని.. అయితే, కమిటీల నియామకంలో తాను మాత్రం జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు.. కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.. సేవ్ కాంగ్రెస్ నినాదంతో ముందుకెళ్తామని ప్రకటించారు మల్లు భట్టి విక్రమార్క.
ఇక, కమిటీల్లోని 108 మందిలో 58 మంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. నాలుగు పార్టీలు మారి వచ్చిన వ్యక్తి పార్టీని ఉద్దరిస్తాడా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. కొత్త కమిటీల్లో బయటి పార్టీ నుంచి వచ్చినవాళ్లే ఎక్కువగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. మరోవైపు.. కాంగ్రెస్‌ను నాశనం చేసే కుట్ర జరుగుతోందని మధుయాష్కీ ఆరోపించారు.. క్యారెక్టర్ లేనివాళ్లు పార్టీని నడిపిస్తున్నారని, తమను ప్రశ్నించే స్థాయి వారికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలస వచ్చినోళ్లకు, కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ రోజు పంచాయితీ వచ్చిందని.. ఇదంతా పార్టీని నాశనం చేసే ప్రయత్నమేనని మండిపడ్డారు.. ఇక, కాంగ్రెస్ ఉనికిని కాపాడిన తమపై కోవర్టులు అనే ముద్ర వేస్తున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెదక్, ఖమ్మంలో పోటీలో నిలబెట్టి కాంగ్రెస్‌ను బతికించామని తెలిపారు. ఉనికి కాపాడమా? దెబ్బతీశామా? మేము కోవర్టులమా? మాపై జిల్లాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారు.. దీనిని వలస నేతలు ఖండించడం లేదు. రాహుల్ జోడో యాత్ర కోసం కష్టపడ్డం. సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలిగా నిర్మల పేరు పెడితే ఎందుకు ఆపారు అని నిలదీశారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో తాజా పరిణామాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని ప్రకటించారు దామోదర రాజనరసింహా. అందరితో మమేకమవుతూ.. కాంగ్రెస్ పార్టీని కాపాడుకునే దిశగా తమ ప్రయత్నం ఉంటుందన్న ఆయన.. పార్టీని పెంచే దిశగా తాము ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాం.. నిజంగానే సోషల్ మీడియాలో తమను తప్పుపడుతున్నారు.. నాలుగు పార్టీల్లో తిరిగి వచ్చిన చరిత్ర తమది కాదు.. కాంగ్రెస్ పార్టీలో పుట్టాం.. పెరిగాం.. పార్టీలో చస్తమని తేల్చేశారు.. కానీ, పార్టీలో ఉంటూ కాంగ్రెస్ కార్యకర్తకు ఈ విధంగా అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేమన్నారు రాజనరసింహా. అయితే, సీనియర్లు అంతా ఏకం అవుతుండడంతో.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఆయన వర్గం ఈ పరిణమాలపై ఎలా స్పందిస్తోంది అనేది ఆసక్తికరంగా మారింది.. పీసీసీ చీఫ్ తర్వాత ఏ స్టెప్ తీసుకుంటారు అనే చర్చ సాగుతోంది.. రేపు పీసీసీ కార్యవర్గ సమావేశం కానుంది.. ఏఐసీసీ కార్యక్రమాలపై చర్చించబోతోంది.. భారత్ జోడో యాత్రకి కొనసాగింపుగా నియోజక వర్గాల్లో యాత్రలు కొనసాగించాలని అధిష్టానం నిర్ణయించడంతో.. ఆ దశగా కార్యాచరణపై చర్చించేందుకు సమావేశం అవుతున్నా.. తాజా పరిణామాలు ఈ సమావేశంపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.. మరోవైపు, మరోసారి కాంగ్రెస్ సీనియర్లు సమావేశం కాబోతోఉన్నారు.. మంగళవారం సమావేశం కావాలని నిర్ణయించారు.. మరికొంత మందిని ఈ సమావేశానికి పిలవాలని అనుకున్నారు.. అదే రోజు అజెండా ప్రకటించనున్నారని తెలుస్తోంది.. దీంతో.. పీసీసీపై సీనియర్లు మరింత దూకుడుగా వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.. మరి, రేవంత్‌రెడ్డి.. వారితో ఎలా వ్యవహరిస్తారు? బుజ్జగిస్తారా? తన దారిలోకి తెచ్చుకుంటారా? ఆయనే వారి దారిలోకి వెళ్తారా? అనే ఆసక్తికరంగా మారింది.