హైదరాబాద్ రాడిసన్ పబ్ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బంజారాహిల్స్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ను సీపీ సీవీ ఆనంద్ సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ పీఎస్‌కు నూతన ఇన్‌స్పెక్టర్‌గా నాగేశ్వరరావును నియమించారు. ప్రస్తుతం ఆయన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్ స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. పబ్‌లో ఆయన టీమ్ డెకాయ్ ఆపరేషన్ చేసి డ్రగ్స్ వ్యహారాన్ని బట్టబయలు చేసినట్లు తెలుస్తోంది. నాగేశ్వరరావుపై గతంలో ఎన్నో సంచలన కేసులు ఛేదించిన రికార్డ్ కూడా ఉంది.
ఇప్పటికే నిర్లక్ష్యం వహించిన ఇన్‌స్పెక్టర్ శివచంద్రను సీపీ సస్పెండ్ చేయడంతో బంజారాహిల్స్ డ్రగ్స్ కేసును నూతన ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు విచారణ చేయనున్నారు. గతంలో శివ చంద్రపై సెటిల్మెంట్లు చేసినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. పబ్‌లపై నిఘా పెట్టకుండా విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు విమర్శలు రావడంతో సీపీ సీవీ ఆనంద్ చర్యలు తీసుకున్నారు. కాగా రాడిసన్ పబ్‌పై పోలీసులు దాడి చేసిన సమయంలో పోలీసులను చూసి పలువురు యువతీ యువకులు కిటికీల్లో నుంచి డ్రగ్స్‌ను బయటకు పడేసినట్లు విచారణలో తేలింది. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పలువురు బాత్‌రూంలో దాక్కున్నారని కూడా సమాచారం. ఈ కేసులో అభిషేక్, అనిల్ కుమార్, కునాల్ పాత్రలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మూడు రోజుల కిందటే పబ్‌ను అభిషేక్ లీజుకు తీసుకున్నారని పోలీసులు వెల్లడించారు.