Mallu Bhatti Vikramarka: ప్రాజెక్టుల పేరుతో పాలమూరు జిల్లాలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న విధంగా తయారైందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. కృష్ణానదిపై ఈ పదేళ్లలో కొత్త ప్రాజెక్టు కట్టి ఒక్క ఎకరానికైనా నీరు ఇచ్చారా..? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పాలమూరు జిల్లాలో ఆనాడు కాంగ్రెస్ హాయాంలో కృష్ణా నదిపై కట్టిన కృష్ణ, బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల వల్లే నీరు అందుతోందని అన్నారు.
Read Also: Kanhaiya Kumar : బీజేపీ ది జూట్.. లూట్ ప్రభుత్వం
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో చుక్క నీరైనా రాలేదని, తెలంగాణలో ఇరిగేషన్ శాకకు చీఫ్ ఇంజనీర్ లేకపోవడం దారుణమని అన్నారు. రిటైర్డ్ ఇంజనీర్లతో పని నెట్టుకు రావడం ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుందని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వద్ద కుర్చీ వేసుకుని కూర్చుంటా అన్నాడు, 33 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తానన్నాడు.. 90 నెలలైనా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని విమర్శించారు.
తొమ్మిదిన్నరేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేస్తే 35 వేల కోట్ల ఖర్చు అయ్యేవి, నేడు ప్రాజెక్టుల ఎస్టిమేషన్ 65 వేల కోట్లకు చేరింది, ఇది కేసీఆర్ తప్పిదమే అని అన్నారు. నాగర్ కర్నూర్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. నాగర్ కర్నూల్ లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అభివృద్ధి మరిచి చెరువుల నల్లమట్టి కొల్లగొట్టి కోట్ల నిధులు స్వాహా చేశారని, ఐదు నెలల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యే మర్రి తిన్నదంతా కక్కిస్తామని అన్నారు. చెరువుల నల్లమట్టి కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరపాలని అన్నారు.