డబుల్ ఇంజన్ సర్కార్ కు మోడల్ ఉత్తర్ ప్రదేశ్ అని అన్నారు బీజేపీ రాజ్యసభ ఎంపీ డా. లక్ష్మణ్. ఎంపీగా గెలిచిన తర్వాత తొలిసారిగా లక్ష్మణ్ హైదరాబాద్ రావడంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు సన్మానించారు. యూపీలో 8 మందిని రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేస్తే అందులో నలుగురు ఓబీసీలు, ఇద్దరు మహిళలు, ఒక దళితుడికి అవకాశం కల్పించి సామాజిక న్యాయం చేశారని లక్ష్మణ్ అన్నారు. ఓబీసీ వర్గాలను బీజేపీ దగ్గర చేస్తా అని అయన అన్నారు. తెలంగాణపై బీజేపీ అధిష్టానానికి క్లారిటీ ఉందని లక్ష్మణ్ అన్నారు. బీజేపీని తెలంగాణలో అధికారంలో తీసుకురావడానికి కృషి చేస్తా అని అన్నారు.
అభివృద్ధి ఎజెండా, గరీబ్ కళ్యాణ్ ఎజెండాతో ముందుకు వెళతామని ఆయన అన్నారు. గంగలో మునిగితే పాపాలు పోతాయి.. కేటీఆర్ ఓసారి నా వెంట రండి అంటూ ఎద్దేవా చేశారు. మూపీలో రైతులకు 36 వేల కోట్ల రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. యూపీలో 5 లక్షల ఉద్యోగాలన భర్తీ చేశారని అన్నారు. బీజేపీ ఉద్యమ ధాటికి తట్టుకోలేకే కేసీఆర్ 80 వేల ఉద్యోగ ప్రకటన చేశారని.. అవి భర్తీ అయ్యేది ఎప్పుడని ప్రశ్నించారు.
యోగీ ఆదిత్యనాథ్ కు, కేసీఆర్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని విమర్శించారు. బీజేపీ పార్టీ నాకు అనేక అవకాశాలు ఇచ్చిందని.. ముషీరాబాద్ కార్యదర్శి నుంచి జాతీయ కార్యదర్శిగా పనిచేశానని..పదవులు రావడం నా గొప్ప కాదని, పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన గౌరవం అని ఆయన అన్నారు. నాలుగు సార్లు ఓడిపోయినా కుంగిపోలేదని.. నా రాజకీయ ఎదుగుదలకు సహకారం అందించిన ముషీరాబాద్ కార్యకర్తలను మరిచిపోలేనని అన్నారు. బీజేపీ అధిష్టానానికి తెలంగాణ పట్ల క్లారిటీ ఉందని స్పష్టం చేశారు.కేసీఆర్ విధానాల వల్ల రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని విమర్శించారు.
యూపీలో మతకలహాలు లేవని.. తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. నెల రోజుల వ్యవధిలో బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు రావడం ట్రైలర్ మాత్రమే అని..ఇన్ ఫ్రెంట్ క్రొకడైల్ ఫెస్టివల్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ ఒకటే అని.. కాంగ్రెస్ ను నమ్మితే హోల్ గా టీఆర్ఎస్ వైపు వెళ్తారని అన్నారు. పార్టీలో కొత్త, పాత వ్యత్యాసం లేదని ఆయన అన్నారు. జాతీయ స్థాయిలో ఎదగాలని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. రామ మందిర నిర్మాణం మోదీ, యోగీ వల్లే సాధ్యం అయిందన్నారు. కాన్పూర్ లో బుల్డోజర్లు రెడీ అవుతున్నాయి. తెలంగాణకు బుల్డోజర్ వస్తుందని ఆయన అన్నారు. రాజ్యసభ సభ్యుడిగా తెలంగాణకు నేనే బుల్డోజర్ తెస్తా అని లక్ష్మణ్ అన్నారు.