దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి చూపు తెలంగాణ వైపే ఉంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ప్రధాని మోదీతో పాటు బీజేపీ కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, పార్టీ ప్రధాన నేతలు హైదరాబాద్ లో మకాం వేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీపై విమర్శలను పెంచాయి.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాను రేపు(ఆదివారం) ఉదయం 9 గంటలకు చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మీ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటానని వెల్లడించారు. బీజేపీ దేవుళ్ల పేరుతో మీద రాజకీయాలు చేస్తోందని.. తెలంగాణ ప్రజలను అయోమయంలో పడేలా చేస్తుందని విమర్శించారు. కేంద్రంలో బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రజలు అవకాశం ఇచ్చారని.. అయితే బీజేపీ మాత్రం ప్రజా సమస్యలను పరిష్కరించకుండా, మంచి పాలన అందించడం లేదని విమర్శించారు.
Read Also:BJP National Executive Meeting: కావాలనే రెచ్చగొడుతున్నారు.. కిషన్ రెడ్డి ఫైర్
నేను రాజకీయాలకు సంబంధం లేకుండా భాగ్యలక్ష్మీ అమ్మవారిని ప్రతీ దీపావళికి వెళ్లి దర్శించుకుంటానని జగ్గారెడ్డి తెలిపారు. కానీ రేపు మాత్రం ప్రజలకు మంచి పాలన అందించేలా బీజేపీకి జ్ఞానాన్ని అందిచాలని, బుద్ధిని ప్రసాదించాలని కోరేందుకు వెళ్తున్నానని అన్నారు. నాతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్, అనిల్ కుమార్ యాదవ్ మరియు ఇతర నేతలు అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందని లేఖలో పత్రికా ప్రకటనలో వెల్లడించారు
మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ కూడా రేపు భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుంటారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ రోజు యోగీ అమ్మవారిని దర్శించుకుంటారని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల రద్దైంది. తాాజాగా ఈ రోజు యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే హైదరాబాద్ పేరు మారుస్తాం అంటూ సంచలన ప్రకటన చేశారు.