కంటోన్మెంట్ జిహెచ్ఎంసిలో విలీనం అయితేనే ప్రజలకు మేలు జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తాజాగా కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని సిల్వర్ కాంపౌండ్ లో 17 కోట్లతో నిర్మించిన 168 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించారు మంత్రులు తలసాని, మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ… కంటోన్మెంట్ కు ఎలాంటి నిధుల కేటాయింపు లేకపోవడంతో అభివృద్ధి జరగడం లేదు. జిహెచ్ఎంసిలో విలీనం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియోజకవర్గాల మాదిరిగానే కంటోన్మెంట్ లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. పేద ప్రజలు ఆత్మగౌరవం తో గొప్పగా బ్రతకాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం. పూర్తిగా ప్రభుత్వ నిధులతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను తెలంగాణ లో తప్ప దేశంలో ఎక్కడైనా నిర్మిస్తున్నారా… అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది అని పేర్కొన్నారు.