నేడు సిద్ధిపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పి. వెంకట్రామ్ రెడ్డి పాల్గొన్నారు. గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామంలో రూ.3 కోట్ల 72 లక్షల 40 వేల వ్యయంతో నిర్మించిన 56 డబుల్ బెడ్ రూం ఇండ్లకు మంత్రులు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. లబ్ధిదారుల కండ్లలో ఆనందం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. 2014 కంటే ముందు, తర్వాత తెలంగాణ పరిస్థితులను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. అన్నం పెట్టిన పాలకులు, ప్రభుత్వాలను మరువొద్దన్నారు. దేశానికీ అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ ఎదిగింది. ప్రతి వ్యక్తికి ప్రభుత్వ లబ్ది జరిగింది ఒక్క తెలంగాణలోనే అని వ్యాఖ్యానించాడు. లబ్దిపొందిన వాళ్ళే ప్రభుత్వాన్ని విమర్శిస్తే, సూర్యుడిపై ఉమ్మినట్టే ఉంటుందన్నారు.