Minister Satyavathi Rathod Says KCR Will Become Telangana CM For Third Time Also: రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తుందని.. కేసీఆర్ కూడా మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని మంత్రి సత్యవతి రాథోడ్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ వల్లే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, సీఎం నేతృత్వంలో కొనసాగుతోన్న ప్రభుత్వం పరిపాలన చూసి పక్క రాష్ట్రాల ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతున్నారని చెప్పారు. కార్యకర్తలంతా ప్రజా క్షేత్రంలో ఉంటూ.. బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపించాలని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొట్టాలని సూచించారు. అడగకుండానే సీఎం కేసీఆర్ తనకు మంత్రి పదవి ఇచ్చారని, గిరిజన మంత్రిగా ఈ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో తన భాగస్వామ్యం ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. కేవలం 4 శాతంగా మాత్రమే ఉన్న గిరిజన రిజర్వేషన్‌ను 10 శాతానికి పెంచిన ఘనత ఒక్క కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
Revanth Reddy: కేటీఆర్‌ని బర్తరఫ్ చేస్తేనే.. విచారణ ముందుకు సాగుతుంది
అంతకుముందు.. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని ఆదివాసీ, గిరిజనులకు స్వర్ణయుగం వచ్చిందని సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో.. ఎస్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని.. బడ్జెట్‌లో 250 జీవోలను విడుదల చేయడమే ఇందుకు నిదర్శమని తెలిపారు. రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచారన్నారు. ఆదివాసీ గూడేలు, తండాలకు తెలంగాణ సర్కారు రూ.2 వేల కోట్లతో 3,152.41 కిలోమీటర్ల పొడవున బీటీ రోడ్లను మంజూరు చేసిందని చెప్పారు. 2,471 గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చి.. అడవిబిడ్డల దశాబ్దాల కలను కేసీఆర్ సర్కార్ సాకారం చేసిందని అన్నారు. అన్నిచోట్లా పంచాయతీ భవనాల నిర్మాణాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ఒక్కో భవనానికి రూ.20 లక్షల చొప్పున రూ.600 కోట్లను మంజూరు చేసిందని గుర్తుచేశారు. 3,467 గిరిజన ఆవాసాలకు రూ.324 కోట్లు ఖర్చు చేసి త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించిందని.. తద్వారా పేద ఆదివాసీ, గిరిజన రైతులకు లబ్ధి చేకూరుతోందని తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని కూడా వెల్లడించారు.