Revanth Reddy Demands CBI Investigation In Paper Leak Case: మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్‌ని చేస్తేనే పేపర్ లీకేజీ కేసు విచారణ సాఫీగా సాగుతుందని, లేకపోతే లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీఎస్‌పీఎస్‌సీ కమిటీని కూడా రద్దు చేయాలని, పేపర్ లీకేజీపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో జరిగిన విస్త్రృతస్థాయి సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ.. లింగారెడ్డి నిన్న సిట్ ముందుకు వెళ్లాడని, అతని బావమరిది ప్రగతి భవన్‌లో సీఎం ఓఎస్‌డీ రాజశేఖర్ రెడ్డి అని పేర్కొన్నారు. కేసీఆర్‌కి రాజశేఖర్ రెడ్డి అత్యంత సన్నిహితుడని.. కేంద్ర సర్వీసులో ఉన్న ఆయన ఏడు సంవత్సరాలు గడిచినా ఇంకా కొనసాగుతూ వస్తున్నారని తెలిపారు. తాము ఫిర్యాదు చేస్తేనే ఆయన రాజీనామా చేశారని.. ఈ లీకేజీ వ్యవహారంలో రాజశేఖర్ రెడ్డి పాత్ర ఏంటన్నది కూడా తేలాలని కోరారు.
Sai Dharam Tej: యాక్సిడెంట్ తరువాత నా మాట పడిపోయింది.. సంచలన నిజాలు చెప్పిన తేజ్
అంతేకాదు.. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్‌పై ఏప్రిల్ 25న సీఎం నియోజకవర్గం గజ్వేల్‌లో నిరుద్యోగ నిరసన సభ నిర్వహిస్తామని కూడా రేవంత్ రెడ్డి ప్రకటించారు. టీఎస్‌పీఎస్‌సీ వ్యవహారాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. టీఎస్‌పీఎస్‌సీ తీగ లాగితే.. ప్రగతి భవన్ లింక్ బయటపడిందని అన్నారు. ఈ పేపర్ లీకేజీ కేసుని సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఫిర్యాదుతోనే ఈ పేపర్ లీక్‌పై ఈడీ కేసు నమోదు చేసిందని తెలిపారు. రాహుల్‌పై అనర్హత వేటు, టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్‌పై తాము జనంలోకి వెళ్తామని అన్నారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా ఏప్రిల్ 3 నుంచి పోస్ట్ కార్డుల ఉద్యమం చేపడతామన్న ఆయన.. ఏప్రిల్ 8న మంచిర్యాలలో సత్యాగ్రహ నిరసన దీక్ష, 10 నుంచి 25 వరకు హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
SRH vs RR: రాజస్థాన్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన సన్‌రైజర్స్
ఇక 20వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జుక్కల్ నుంచి పాదయాత్ర జరుగుతుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అదానీ ఇష్యూపై పార్లమెంట్‌లో రాహుల్ ప్రశ్నించారని.. అందుకే రాహుల్‌పై ప్రధాని మోడీ, అదానీ, అమిత్ షా పగబట్టారని ఆరోపించారు. రాహుల్‌పై కక్షపూరితంగానే అనర్హత వేటు వేశారని విమర్శించారు. ఇదే సమయంలో.. పార్టీ సమావేశాలకు డుమ్మా కొట్టిన ప్రధాన కార్యదర్శులను తొలగించాలని పీసీసీ నిర్ణయించింది. వరుసగా ఐదు సమావేశాలకు రాని ప్రధాన కార్యదర్శులకు నోటీసులిచ్చి తొలగిస్తామని రేవంత్ స్పష్టం చేశారు. పార్టీ కోసం పనిచేయని ప్రధాన కార్యదర్శులు ఎందుకని ప్రశ్నించిన ఆయన.. వరుసగా ఐదు సమావేశాలకు రాని వారిని నోటీసులిచ్చి, 24 గంటల్లో తొలగిస్తామని చెప్పారు.