తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు నిరవధిక వాయిదా పడ్డాయి. నేడు సభలో సీఎం కేసీఆర్ 111 జీవో ఎత్తేస్తామని ప్రకటించారు. దీనిపై మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందిస్తూ.. గతంలో త్రాగునీటి అవసరాల కోసం అక్కడ 111 జీవోను అమలు చేశారని, కానీ ఇప్పుడు ఆ రిజర్వాయర్ల ద్వారా త్రాగునీటి అవసరం లేదు కనుక ఇబ్బంది లేదన్నారు. 111జీవో పై సీఎం సరైన నిర్ణయం తీసుకున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. 84 గ్రామాల పరిధిలో దీనితో మేలు జరుగుతుందని, టీఆర్‌ఎస్ నేతలకు మేలు చేయడం కోసమే జీవో ఎత్తి వేస్తున్నారనే ఆరోపణలు చేయడం సరికాదన్నారు. చాలా మందికి అక్కడ ల్యాండ్ ఉందని, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు మంచి చేస్తే విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. 111 జీవో పై లేనిపోని విమర్శలు చేస్తే దాని పరిధిలో ఉన్న వివరాలు సేకరిస్తామని, ఇది ఎప్పటి నుండో దాదాపు 84 గ్రామాల పరిధిలో ఉన్న ప్రజలు అడుగుతున్న సమస్య అని ఆయన వెల్లడించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే స్పందిస్తూ.. 111 జీవో ఎత్తి వేస్తా అని సీఎం చెప్పడం నీ స్వాగతిస్తున్నామన్నారు. మంచి నిర్ణయం.. వైఎస్ హయాంలోనే కమిటీ వేశారు. కోర్టు లో పిటిషన్ పడటంతో ఆగిపోయిందని ఆయన వెల్లడించారు. 111 జీవో ఎత్తెస్తే… రైతులు అదృష్టవంతులు అని, అక్కడి చెరువులకు ఇబ్బంది లేకుండా 111 జీవో ఎత్తి వేస్తే సరిపోతుందన్నారు. చెరువులకు ముప్పు లేదని సీఎం చెప్తున్నా… వాటికి నీళ్ళు కూడా వచ్చేలా చూడటం మంచిదన్నారు.
కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోదండ రెడ్డి 111 జీవో ప్రకటనపై మాట్లాడుతూ.. జీవో 111 ఎత్తివేత ప్రకటన.. అదరా బాదరా ప్రకటన సరికాదని ఆయన మండిపడ్డారు. 111 జీవో ఎత్తేసి.. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభం చేయాలని అనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. 111 జీఓ పరిధిలో ఉన్న గ్రామాల పరిధి తగ్గించండి అప్పుడు రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఇప్పటికే బడా బాబులా చేతిలోకి 111 జీవో భూములు వెళ్ళాయని, పర్యావరణ అనుమతులు, ఎన్‌జీటీ అనుమతులు రావడం కష్టమన్నారు. సీఎం ఉన్నత స్థాయి కమిటీ వేసి చర్చించాలని, లేదంటే రైతులు నష్టపోతారు… రియల్ ఎస్టేట్ వ్యాపారులు లాభ పడతారని ఆయన హితవు పలికారు.