వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మండి పడ్డారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎందుకోసం పాదయాత్ర చేపడుతున్నాడు, ముందు తమ పార్టీ తెలంగాణ కు ఏమి ఇచ్చిందో చెప్పి పాద యాత్ర చేయాలని అన్నారు. సస్యశ్యామలం అయిన తెలంగాణలో అలజడులు సృష్టించేందుకు కొన్ని శక్తులు యాత్రల పేరుతో బయలుదేరాయని, వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచి ప్రజలను దోచుకొని తింటున్న బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజలకు ఎ ముఖం పెట్టుకొని యాత్రలు చేస్తున్నాడని దుయ్యబట్టారు.
సంగ్రామం ఎవరి మీదో చెప్పాలని, సంతోషం గా ఉన్న రైతుల మీదనా, ప్రజల మీదనా చెప్పాలని సంజయ్ ను డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, విభజన చట్టం లోని అంశాలను నెరవేర్చేలా కేంద్రం పై సంగ్రామం చేయాలని బండి సంజయ్ కు సలహా ఇచ్చారు. సుభిక్షంగా ఉన్న తెలంగాణ ను చూసి ఓర్వలేక చేస్తున్న యాత్రలను ప్రజలు పట్టించుకోరని అన్నారు.. ఇక సిగ్గు శరం లేని తెలంగాణ ద్రోహి చంద్రబాబు,తెలంగాణ లో ప్రజలకు ముఖం చూపెట్టలేక ఆయన తొత్తు అయిన రేవంత్ రెడ్డి ని ఇక్కడ పెట్టి రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అభివృద్ధి నిరోధుకులైన కాంగ్రెస్, బీజేపీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే తెలంగాణ ప్రజలు మళ్ళీ నానా అవస్థలు పడే ప్రమాదం ఉందని నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.