మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా వికలాంగులకు మూడు చక్రాల వాహనాలు అందించేందుకు ముందుకు వచ్చారు పలువురు ప్రజాప్రతినిధులు. ఈ నేపథ్యంలోనే నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ లో లబ్ధిదారులకు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా త్రిచక్ర వాహనాలను అందజేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఉన్నప్పుడు డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తామని.. అనవసర ఖర్చు కూడా చేయాల్సి వస్తుందని చెప్పారు. బ్యానర్లు, హోర్డింగ్స్ పెట్టి వృధా ఖర్చు చేస్తాం. దాన్ని తగ్గించుకోవాలని ఈ ఆలోచన చేశామని.. మనకు ఆత్మ సంతృప్తి ఇచ్చే కార్యక్రమంలో భాగంగానే గిఫ్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. కోవిడ్ సందర్భంగా వృధా ఖర్చులు పెట్టొద్దని గత సంవత్సరం నా పుట్టినరోజు సందర్భంగా వంద అంబులెన్స్ లు వితరణ చేశామన్నారు. ఈ సంవత్సరం వెయ్యి మోటార్ సైకిళ్లు అంగవైకల్యం ఉన్న వారికి అందించామని ప్రకటించారు. టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు స్వతహాగా ముందుకు వచ్చి ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేస్తున్నారన్నారు.