ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ పటిష్టత కోసం ఆ పార్టీ నాయకత్వం కృషిని ప్రారంభించింది. పార్టీలో అసంతృప్తి వాదులుగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి లు పార్టీ కార్యాలయానికి వచ్చేలా చేయడంలో కేటీఆర్ సక్సెస్ అయ్యారు. ఇది పార్టీ లో ఒక్కవిజయంగా కూడా చెప్పవచ్చు. ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాల్లోనే ఉన్నప్పటికి పార్టీలో ఎటువంటి పదవులు లేకుండా ఉన్న వారిని కూడా దగ్గరకు తీసుకునే చర్యలు పార్టీ చేపట్టినట్లుగా అయ్యింది. పోలీసుల వినియోగాన్ని తగ్గించాలని మాత్రం నాయకులకు కేటీఆర్ హితబోధ చేశారు.
ఖమ్మం నగరంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన చేపట్టారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. ఈనేపథ్యంలో బహిరంగ సభలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలను దుమ్మెత్తి పోశారు. అయితే పార్టీ నాయకత్వాన్ని పటిష్ట పరిచేందుకు మాత్రం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశం మొత్తం పర్యటనలో ఒక్క ఎత్తుగా పని చేసింది. జిల్లాలోని ఎంఎల్ఎ లు, అదే విధంగా పార్టీలో గతంలో పని చేసిన ఎంఎల్ఎ లు ఓడిపోయిన వారిని కూడా పార్టీ సమావేశానికి పిలిపించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారినుద్దేశించి గెలిచే గుర్రాలకే పార్టీ టిక్కెట్లను ఇస్తామని మాత్రం స్పష్టం చేశారు. అంటే మీరందరూ బాగా పని చేయాలని సూచించినట్లుగా అయ్యింది.
నాయకులు పోలీసుల మీదనే అధికంగా ఆధార పడుతున్నారు. అది పార్టీకి, నాయకత్వానికి పెద్ద సమస్య అవుతుంది. పెద్ద పెద్ద కాన్వాయ్ లు, దానికి పోలీసు పహారాలు అవసరమా అని నాయకులకు సుతి మెత్తగా హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల్లో మనకు పట్టు ఉంది, సర్వేలన్నీ అవే చెబుతున్నాయి. అందువల్ల నాయకులు పోలీసుల వినియోగం తగ్గించడని కేటీఆర్ సూచించారు. మనకు ఇంత బలం ఉన్నప్పటికి ఎందుకు గెలవలేకపోతున్నాం. కలసి కట్టుగా పని చేస్తే గెలుస్తాం.. తుమ్మల , పొంగులేటి అనుభవాలను మనం ఉపయోగించుకోవాలని అన్నారు. ఓడిన వారికి కూడా పదవులను ఇస్తాం.. ఇస్తున్నాం. వారిని కూడా ఎక్కడా దూరంగా పెట్టవద్దని కేటీఆర్ అన్నారు.
కాగా జాతీయ పార్టీ గురించి కూడా సమావేశంలో చర్చించినట్లుగా తెలిసింది. జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నామని ఈ నెల 19 వరకు దాని గురించి ఒక్క ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెప్పారు. జాతీయ రాజకీయాల్లోకూడా కీలకంగా ఉంటామని చెప్పారు. అంతకు ముందు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంటికి లంచ్ కు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. పొంగులేటి ఇంటికి లంచ్ కు వెళ్లడంతో పొంగులేటి కూడా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు.అదే విధంగా నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ లో కేటీఆర్ ఇంటిలో తుమ్మల భేటీ అయ్యారు. దీంతో తుమ్మల కూడా పార్టీ కార్యాలయానికి వచ్చారు. మొత్తం మీద జిల్లాలో ఉన్న వర్గ విభేదాలను సమన్వయ పరచడానికి కేటీఆర్ చేసిన ప్రయత్నం సఫలీ కృతం అవుతున్నట్లుగా అర్ధం అవుతుంది. మరి కొన్నిరోజుల్లో మరోసారి జిల్లా నేతలతో సమన్వయ పరిచేందుకు సమావేశం జరుగనుంది.