రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. దమ్ముంటే ప్రధాని మోదీ వద్దకు వెళ్లి వేములవాడకు రూ.వెయ్యి కోట్ల ప్యాకేజీ తీసుకురావాలన్నారు. బండి సంజయ్ ఎంపీగా గెలిచి మూడేళ్లు అవుతుందని.. మూడేళ్ల కాలంలో మూడు పైసలు కూడా తేలేదన్నారు. బీజేపీ అంటే బక్వాస్ పార్టీ అని.. ఆ పార్టీ నేతలకు లొల్లి ఎక్కువ.. పని తక్కువ అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. సిరిసిల్ల నేతన్నలకు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఆరోపించారు. పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వరని.. అదే కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తారన్నారు. కానీ మనం అరిచినా, గీ పెట్టినా కూడా మనకు జాతీయ హోదా ఇవ్వరని కేటీఆర్ ఆరోపించారు.
మోదీ కేవలం ఉత్తర భారతానికే ప్రధాన మంత్రా? తెలంగాణ ప్రజల మీద ఎందుకింత వివక్ష అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో జరిగే మేడారం జాతరను మినీ కుంభమేళా అంటారని. ఐదారు రాష్ట్రాల నుంచి లక్షల మంది భక్తులు వస్తారని… అట్లాంటి జాతరకు కేంద్ర ప్రభుత్వం కేవలం రూ. రెండున్నర కోట్లు మాత్రమే ఇచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. యూపీలో జరిగిన కుంభమేళాకు మాత్రం రూ. 375 కోట్లు ఇచ్చారని… మనకు ముష్టి వేసినట్టు రూ. రెండున్నర కోట్లు ఇచ్చారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన గత 8 ఏళ్లలో తెలంగాణకు ఎన్ని విద్యాసంస్థలు ఇచ్చారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు మన నాయకుడిపై మాట్లాడితే బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తిరుగులేని శక్తిగా వరుసగా మూడో సారి టీఆర్ఎస్ విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేసే దిశగా కార్యకర్తలు కృషి చేయాలన్నారు.