తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై మంత్రి కొప్పుల ఈశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దపల్లిలో అయన నేడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని అదానీ, అంబానీల చేతుల్లో పెట్టిన ఘనత బీజేపీకే దక్కిందని ఆయన విమర్శించారు. బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని ఆయన ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి దమ్ముంటే భారతదేశమంతా దళిత బంధు అమలు చేయించాలని మంత్రి సవాల్ విసిరారు.
రాష్ట్రంలోని దళితులకు బీజేపీ అసలు స్వరూపం తెలుసని, ఎట్టి పరిస్థితుల్లో కాషాయ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు దళిత సమాజం సిద్ధంగా లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై ఫోకస్ పెడతామని, దళిత ఎమ్మెల్యేలపై అసత్యపు ఆరోపణలు బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గమనిస్తున్నదని ఆయన అన్నారు.