రాజ్యసభలో ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్ర విభజనకు బీజేపీ వ్యతిరేకమని మరోసారి రుజువైందని ఆయన అన్నారు. సాక్షాత్తూ ప్రధానమంత్రి ఈరోజు రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అభ్యంతరం, ఆక్షేపణీయమని ఎర్రబెల్లి మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మోడీ వ్యాఖ్యలు ఉన్నాయి. దేశ సమాఖ్య స్ఫూర్తికి మోడీ వ్యాఖ్యలు పూర్తిగా వ్యతిరేకమని, ప్రజాస్వామ్యంపై బీజేపీకి ఏమాత్రం నమ్మకం లేదని తేలిపోయిందని ఆయన అన్నారు. తెలంగాణపై బీజేపీకి మోడీకి ఎందుకంత అక్కసు? అని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే, అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆయన దుయ్యబట్టారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అన్న కాకినాడ తీర్మానం అర్థం ఏంటి? ఆనాటి నుండి బిజెపి తెలంగాణ ప్రజలను మభ్యపెడుతూ ఉంది.
ఆనాడు మూడు రాష్ట్రాలను విభజించిన బిజెపి తెలంగాణ విభజనను ఎందుకు అడ్డుకుంది? తెలంగాణ విభజనకు మీరు వ్యతిరేకం కాబట్టే విభజన హామీలు అమలు చేయడం లేదా? అని ఆయన అన్నారు. ఏ విభజన స్ఫూర్తితో లోయర్ సీలేరు ప్రాజెక్ట్ సహా, ఏడు మండలాలను ఆనాడు ఆంధ్ర లో కలిపారు? అందుకే తెలంగాణ పట్ల విద్వేషపూరిత వివక్షతను ప్రదర్శిస్తున్నారా? మోడీ ప్రధానమంత్రి గా ఉండి అలా మాట్లాడడం దురదృష్టకరం. ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారు? ప్రధాని మోడీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా అని ఆయన వెల్లడించారు.